Wednesday, 4 November 2026

మార్కెట్‌ మాయాజాలంలో రైతులు

రైతులకన్నా దళారుల సంపాదనే మిన్న

క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలతోనే రైతులకు ఊరట

హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్దమైన వేళ మార్కెట్లలో దళారీల మాయాజాలానికి అడ్డుకట్ట పడడం లేదు. దీనిని అరికట్టనంత కాలం రైతులు నిరంతరం దగా పడాల్సిందే. ఓ లెక్క ప్రకారం రైతులు పండించడం వల్ల సంపాదించే దానికన్నా దళారీలు సంపాదనే ఎక్కువని తెలుస్తోంది. గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడం, తేమ ఉందన్న సాకులు చూపడం, ఫలానాది లేదనడం, రైతులు పడిగాపులు పడేలా చేయడం మార్కెట్లలో షరా మామూలయ్యింది. ఏ మార్కెట్‌ చూసినా ఇలాంటి బాగోతాలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌ పాలకవర్గాలు దళారీలతో కుమ్మక్కయ్యి రైతులను దోచుకుంటున్నారే తప్ప రైతుల కోసం కష్టపడడం లేదున. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రైతులు అనేక విధాలుగా దగా పడుతున్న వారికి దన్నుగా నిలవడం లేదు. కష్టాలు అన్నీ అధిగమించి పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకుని వస్తే ఎదురుచూపులు, పరాభవాలు, అడ్డికి పావుశేరు అన్నచందాన రైతుల పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అంటారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్నిరకాల పరికరాలనూ అందుబాటులో ఉంచాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని ప్రకటించాక కూడా మోసాలు తప్పడం లేదు. అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకటనల మేరకు మార్కెట్లలోపరిస్థితులు ఉండడం లేదు. ఇకపోతే పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సరికొత్త విధానానికి నాంది పలికిన జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ,నేషనల్‌ అగ్రికల్చరల్‌ మార్కెట్‌ నామ్‌ విధానం అభాసుపాలైంది. తెలంగాణ రాష్ట్రంలోనే గత సీజన్‌లో అత్యధిక లావాదేవీలు నడిపి రికార్డుకెక్కిన నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు వేదికగా అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. సర్వర్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మార్కెటింగ్‌ అధికారులు చెప్పడంతో బహిరంగ వేలం ద్వారానే కొనుగోళ్లు జరుపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు రైతులకు కుచ్చుటోపీ పెట్టారు. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తమను తప్పుదోవ పట్టించి కొనుగోళ్లు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ వందలాది రైతులు గతంలో మార్కెట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వరంగల్‌ మార్కెట్‌లోనూ ఇదే తంతు కొనసాగింది. వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని.. మార్కెట్‌ సిబ్బంది వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకు ధర తగ్గిస్తున్నారని రైతులు మార్కెట్‌ అధికారులపై మండిపడ్డారు. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (నామ్‌) పేరుతో మోసం చేస్తున్నారని అన్నదాతలు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఎందుకనో అధికారులు సకాలంలో రంగంలోకి దిగలేకపోయారు. ఎందుకనో సమస్యలను పట్టించుకునే ప్రయత్నాలు చేయడం లేదు. రైతుల సమస్యలపై చర్చిస్తున్న మంత్రులు కిందిస్థాయిలో మాత్రం ఆదేశాలు అమలయ్యేలా చేయడం లేదు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కూడా పలు మార్కెట్లలో ఇలాంటి దృశ్యాలే ఇంకా గోచరిస్తున్నాయి. సిఎం కెసిఆర్‌, మార్కెటింగ్‌ మంత్రి హరీష్‌ రావులు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదు. ఇకపోతే ఎపిలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. నకిలీ విత్తనాలతో అనేకమంది రైతులు ఇరు రాష్ట్రాల్లో నిండా మునిగారు. అయినా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అలాగే వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతో కొంత పంట నష్టం వాటిల్లుతోంది. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రభుత్వానికి సకాలంలో నివేదిక పంపకపోవడం వల్ల పంటనష్టాలను సకాలంలో పొందడం లేదు. రైతులు ఏటా అప్పుల ఊబిలో కూరుకుని పోతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. వ్యవసాయశాఖ అధికారులు రికార్డుల్లో పెట్టుబడి రాయితీ రావాల్సి ఉంది.. అని చూపటంతో సరిపెడు తున్నారు. అన్నదాతకు మాత్రం లబ్ధి చేకూరటం లేదు. ఇకపోతే ఎరువుల వాడకంలో మోతాదును మించి పోతున్నారు. సేంద్రియ వ్యవసాయంపై అవగాహన అంతంత మాత్రంగానే సాగుతోంది. చైతన్యం కలిగించిన చోట ఎరువుల వాడకంలో రైతులు నియంత్రణ పాటిస్తున్నట్లు అర్థమవుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న భూ స్వభావానికి అనుగుణంగా ఎరువులు వాడాల్సి ఉంది. భూమిలో సారం తగ్గిపోవటం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయిందని, ఈ నేపథ్యంలో ఎరువుల వాడకం మొదలు పెట్టారు.అధిక ఎరువులు వాడి భూమిని నిస్సారం చేయవద్దని సూచించినా దానిని అమలు చేసేలా చేయడం లేదు. మార్కెట్లో గోల్‌మాల్‌ జరిగినా చర్యలు ఉండవు. వీటిపై రైతులు ఆందోళనకు దిగినా ఊరట దక్కడం లేదు. ఇలా పరిస్థితులను పట్టించుకోకుంటే అన్నదాత ఎవరికి చెప్పుకుంటారు. ప్రభుత్వాలు సీరియస్‌గా ఆలోచన చేయాల్సి ఉంది.