ఓ వైపు మిత్రులకు సీట్ల కేటాయింపు
మరోవైపు తమపార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు
మిర్యాలగూడ, దుబ్బాక, ఇబ్రహింపట్నలలో స్నేహపూర్వకపోటీ అట
హైదరాబాద్,నవంబర్19(జనంసాక్షి): మహాకూటమిలో సీట్ల సర్దుబాటు గందరగోళంగా మారింది. కాంగ్రెస్ అతితెలివిగా ప్రవర్తిస్తోంది. ఇంతకాలం సీట్ల కేటాయింపులో నాన్చివేత ధోనణి ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిత్రధర్మానికి విరుద్దంగా వ్యవహరించి అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మిర్యాలగూడ సీటును బిసి సంక్షేమ సంఘం నేత కృష్ణయ్యకు ప్రకటించి, పొత్తులో భాగంగా టిజెఎస్‌కు కేటాయించింది. దీంతో మిత్రపక్షాలు కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నాయి. ఇప్పటికే మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో కూడా కాంగ్రెస్ సోమవారం బి-ఫారాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ తప్పేట్లు లేదని నేతలు భావిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా కూటమి పార్టీలకు ఇచ్చిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అదనంగా బి-ఫారాలు ఇవ్వడంతో ఇప్పుడు భాగస్వామ్య పార్టీల్లో ఆందోళన నెలకొంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 25 స్థానాలను తెదేపా, తెజస, సీపీఐలకు కేటాయించగా కాంగ్రెస్ పార్టీ 94 స్థానాలకు పోటీ చేయాల్సి ఉంది. అయితే, తెలంగాణ జన సమితి అభ్యర్థులను ప్రకటించిన వరంగల్ తూర్పు, దుబ్బాక, మిర్యాలగూడ స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి బి-ఫారాలు ఇచ్చింది. ఇప్పటికే తెదేపాకు ఇచ్చిన ఇబ్రహీంపట్నం స్థానానికి కూడా కాంగ్రెస్ బి-ఫారం అందించింది. అక్కడ మల్‌రెడ్డి రంగారెడ్డి పోటీలోకి దిగారు. పటాన్‌చెరు, హుజూరాబాద్ స్థానాల్లో ఒక స్థానానికి తెదేపా పోటీ చేయాల్సి ఉండగా ఆ రెండింటికీ కాంగ్రెస్ బి-ఫారాలు ఇచ్చి తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించింది. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పటాన్‌చెరు నుంచి కాటా శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జనసమితికి కేటాయించిన దుబ్బాక నుంచి మద్దుల నాగేశ్వర రెడ్డికి, వరంగల్ తూర్పు నుంచి వద్దిరాజు రవిచంద్ర, మిర్యాలగూడ నుంచి ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. ఆటు తెదేపా, ఇటు తెలంగాణ జన సమితి పార్టీలు తాజా పరిణామాలతో తలపట్టుకున్నాయి. స్నేహపూర్వకంగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతుండగా ఈ పద్ధతి సరికాదని, కూటమి ధర్మాన్ని పాటించాలని భాగస్వామ్య పార్టీలు కోరుతున్నాయి. వెంటనే ఈ సీట్లపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.




