మిషన్‌ కాకతీయతో చెరువులకు మహర్దశ

సంగారెడ్డి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు  ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తుందన్నారు. ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను కోట్లాది రూపాయలు వెచ్చించి చెరువుల పునరుద్ధరణకు ఓ మహత్తర కార్యక్రమాన్ని తీసుకవచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. మిషన్‌ కాకతీయ పథకంలో నాణ్యమైన పనులు చేపట్టేలా చూడాలని ఇరిగేషన్‌ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. చెరువుపునరుద్ధరణ పనులకు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యేతెలిపారు. అనేక గ్రామాల్లో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.  ముఖ్యమంతి కేసీఆర్‌ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. సీఎం చేపడుతున్న సంక్షేమ పథకాలు యావత్‌దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. వివిధ సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే ప్రజాసంక్షేమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. వచ్చే వానాకాలం నాటికి చెరువులు, కుంటలకు మల్లన్నసాగర్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మల్లన్నసాగర్‌ ద్వారా ప్రస్తుత వానాకాలం సీజన్‌కు నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు నీరు నింపుతామని, అన్నారు.