నేడు హాజరు పర్చాలని పోలీసులకు కోర్టు ఆదేశం
చంద్రముఖి అదృశ్యంపై కోర్టును ఆశ్రయించిన తల్లి
కిడ్నాప్ చేసివుంటారని బిఎల్‌ఎఫ్ ఆందోళన
హైదరాబాద్,నవంబర్28(జనంసాక్షి): గోషామహల్ బీఎల్‌ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. చంద్రముఖి కనిపించడం లేదని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తల్లి.. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. చంద్రముఖిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న పిటిషనర్ వినతిని కోర్టు అంగీకరించింది. ఈ మేరకు మధ్యాహ్నం విచారించిన న్యాయస్థానం గురువారం ఉదయం 10.15 గంటలకు చంద్రముఖిని కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. భాజపా తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, తెరాస నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీలో ఉన్న గోషామహల్ నుంచి చంద్రముఖి కూడా బరిలో ఉన్నారు. ట్రాన్స్‌జెండర్‌ల సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమంటూ ప్రచారం చేస్తున్న చంద్రముఖి.. కొన్ని రోజులుగా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు, బీఎల్‌ఎఫ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రముఖి ఆచూకీ ఇంకా లభించలేదని బీఎల్‌ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొవడం లేదని తెలిపారు. ఇది పోలీసుల చేతకాని తనమేనని మండిపడ్డారు. ఒక ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా చేశారన్నారు. గోశామహల్ లో పోటీ చేయబోయే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు నేర చరిత్ర ఉందన్నారు. దేశంలో మొదటిసారి ఒక హిజ్రా ఎన్నికల్లో పోటీ చేయబోతోందని, ఆమెను కిడ్నాప్ చేయడం దురదృష్టకరమని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే చంద్రముఖి ఆచూకీ లభించడం లేదన్నారు. ఈ ఘటనపై ఏ రాజకీయ పార్టీ నుండి కనీసం స్పందన లేదని మండిపడ్డారు. చంద్రముఖి సమస్యపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖి విషయంలో టీఆర్‌ఎస్ బాధ్యత వహించాలన్నారు. కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేశామని, చాలా ప్రజా సంఘాలు ఈ కేసులో ఇంప్లిడ్ అవుతామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య అభివృద్ధికి చంద్రముఖి ప్రతీక అని కొనియాడారు. ఒక ట్రాన్స్ జెండర్ కిడ్నాప్ జరిగితే ఎవరు స్పందించకపోవడం బాధాకరమని ట్రాన్స్ జెండర్ ప్రతినిధి లైలా అన్నారు. చంద్రముఖి చాలా ప్రోగ్రెసివ్ వ్యక్తి అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామన్నారు. చంద్రముఖి పిరికి వ్యక్తి కాదని, ఖచ్చితంగా కిడ్నాప్ కి గురైందని తెలిపారు. చంద్రముఖి దొరికే వరకు గోశామహల్‌లో ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని నిప్పులు చెరిగారు. మంగళవారం ఉదయం నుండి చంద్రముఖి కనపడడం లేదని, పౌర హక్కుల కోసం పోరాడే చంద్రముఖి కిడ్నాప్ కావడం దారుణమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ కిడ్నాప్‌కు ఆపద్ధర్మ సీఎం కేఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖికి
వస్తున్న ఆదరణ తట్టుకోలేకే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారన్నారు. చంద్రముఖి బయపడి పారిపోయే వ్యక్తి కాదు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేదంటే దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.




