ఏన్డీఏకు దీదీ సవాల్
కోల్‌కతా, నవంబరు 24 (జనంసాక్షి) : మీకు దమ్ముందా? అయితే రాష్ట్రపతి పాలన విధించండి.. అని ఏన్డీఏ ప్రభుత్వంపై మరోసారి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేసింది. తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీకి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విూద ఎక్కడలేని కోపం వచ్చింది. సెక్యులరిజం విూద ఏర్పాటైన సదస్సుకు హాజరుకావడం వల్లే తమ పార్టీ ఎంపీ శ్రింజయ్ బోస్ను అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. ఇలాంటి సదస్సులకు వేలసార్లు తాను హాజరవుతానని స్పష్టం చేశారు. దమ్ముంటే పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని మమత సవాలు చేశారు. తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే తాము ప్రతిఘటిస్తామని, అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోడానికి తాను సిద్ధమని సవాలు చేశారు. ఇక సీబీఐ తీరుపై కూడా మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గడిచిన ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా అనేక అల్లర్లు జరిగాయన్నారు. ఈ దేశాన్ని నడపడం అంత సులభం కాదంటూ బీజేపీకి కూడా హెచ్చరిక జారీ చేశారు.
నా పాత్ర రుజువైతే రాజీనామా
శారదా చిట్‌ఫండ్ స్కాంలో తన పాత్ర రుజువైతే తక్షనం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంలో దాచాల్సినది ఏవిూ లేదని చెప్పారు. శారదా గ్రూపుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. ‘ఎవరన్నారు? ముందు విూరు ఆరోపణలు నిరూపించాలి. అందుకు సాక్ష్యాలు చూపించాలి. విూరు రుజువు చేస్తే నేను వెంటనే రాజీనామా చేస్తా’ అని ఆమె అన్నారు. శారదా స్కాం మూలాలు లెఫ్ట్ ప్రభుత్వంలో ఉన్నాయని మమత ఆరోపించారు. తాము ఆ స్కాంకు బాధ్యుడైన వ్యక్తిని అరెస్టు చేశామని, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయించామని అన్నారు. ఐదు లక్షల మందికి డబ్బులు కూడా వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు. అసలు తమవిూద ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పని చెప్పారు.అయితే.. జాతీయస్థాయిలో లౌకిక వాదాన్ని కాపాడేందుకు అవసరమైతే తమ పార్టీ వామపక్షాలతో చేతులు కలిపే అవకాశం ఉందని కూడా మమతా బెనర్జీ అన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు అవసరమైతే కలిసి వెళ్తామని చెప్పారు. అయితే ఇది కేవలం జాతీయస్థాయిలో ఉంటుందే తప్ప బెంగాల్లో మాత్రం కాదని స్పష్టం చేశారు. బెంగాల్లో వామపక్షాల కథ ముగిసిపోయిందని, వాళ్ల భావజాలం.. తమ భావజాలం పూర్తిగా వేరని అన్నారు. లౌకిక వాద కూటమిని ఏర్పాటుచేసేందుకు ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి బీజేపీని ఓడించాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేరు ప్రస్తావించకుండానే ఆయన స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. మోదీ చెబుతున్న స్వచ్ఛభారత్ పాత కార్యక్రమమేనని అన్నారు. అది కేవలం ఫోటోలకు ఫోజులిచ్చే కార్యక్రమమేనని విమర్శనాస్త్రాలు సంధించారు.





