Wednesday, 4 November 2026

‘ముందస్తు’ వేగం

– ముందస్తు ఎన్నికలకు వేగం పెంచిన తెరాస ప్రభుత్వం
– గవర్నర్‌తో సీఎస్‌, అసెంబ్లీ కార్యదర్శి భేటీ
– ఎన్నికల ప్రధాన అధికారితోనూ భేటీ అయిన సీఎస్‌
– వేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయాలు
– ఫామ్‌హౌస్‌ నుంచి ముందస్తుకు కేసీఆర్‌ వ్యూహరచన!
– 7న హుస్సాబాద్‌లో బహిరంగ సభకు సన్నాహాలు
– మంత్రి హరీష్‌రావు, ఈటెలకు బాధ్యతలు అప్పగింత?
– శ్రావణమాసం చివరి శుక్రవారం మంచిదని జ్యోతీష్యుల సలహా
– ఆరోజు నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఆ మేరకు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఒకవైపు రాజకీయాలపై కేసీఆర్‌, మరోవైపు ఎన్నికల కసరత్తుపై అధికార యంత్రాంగం వేగంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 6న క్యాబినెట్‌ సమావేశం అనంతరం అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వీటిని నిజంచేస్తూ గవర్నర్‌ను సీఎస్‌, అసెంబ్లీ సెక్రటరీలు కలవడం ప్రాధాన్యత ఏర్పడింది. ముందస్తు సంకేతాలతో ఉన్నతాధికారుల వరుస భేటీలు హాట్‌టాపిక్‌గా మారాయి. మంగళవారం జరిగిన పరిణామాలు చూస్తే.. ముందస్తు ఖాయంగా కనిపిస్తుంది. ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ.. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు సెక్రటేరియెట్‌లో సమావేశమయ్యారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో కూడా భేటీ అయ్యారు. దాదాపు అరగంటకుపైగా ఈ సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది. అనంతరం సీఎస్‌ జోషి-రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌తో సమావేశం అయ్యారు.
అసెంబ్లీ రద్దు ఖాయమేనా..!
ప్రభుత్వంలో కీలకమైన ఉన్నతాధికారుల వరుస భేటీలతో.. మరోసారి ముందస్తు, అసెంబ్లీ రద్దు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ అంశాలపై చర్చించేందుకే అధికారులు గవర్నర్‌ను కలిశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎస్‌ రాజభవన్‌కు వెళ్లడం మామూలే.. కాని అసెంబ్లీ కార్యదర్శి కూడా వెళ్లడంతో ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాదు ఈ భేటీలో రాజ్యాంగపరమైన అంశాలపై చర్చించారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎస్‌ ఎన్నికల ప్రధాన అధికారిని కలవడం కూడా ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.
మరోవైపు తెలంగాణ కేబినెట్‌ భేటీ కూడా రెండు మూడు రోజుల్లో ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ప్రగతి నివేదన సభలానే.. హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫాం హౌజ్‌లో కేసీఆర్‌ ముందస్తు వ్యూహ రచన..
ముందస్తు ఎన్నికల కసరత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పీడ్‌ పెంచారు. ఫాం హౌజ్‌లో కేసీఆర్‌ ముందస్తు వ్యూహ రచన చేస్తున్నారు. కేబినెట్‌ సమావేశం సహా, అసెంబ్లీ రద్దుపై కసరత్తు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ఫాం హౌజ్‌కు చేరుకున్న కేసీఆర్‌ పార్టీ సీనియర్లతో చర్చలు జరుపుతున్నారు. ముందస్తుకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్‌ లాంచనాలన్నీ ఒక్కక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. 6న తెలంగాణ కేబినెట్‌ సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన అంశాలన్నిటికి ఆమోదముద్ర వేస్తూనే.. అసెంబ్లీ రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. 7న హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది. దీనికి సంబంధించి సోమవారం కేసీఆర్‌ మంత్రులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. హుస్నాబాద్‌లో జరగనున్న సభ ఏర్పాట్లను మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ అప్పగించినట్లుగా తెలియవచ్చింది. 7న కేసీఆర్‌ సెంటిమెంట్‌ డేగా చెబుతున్నట్టు సమాచారం. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో మంచిదన్నభావనతో ఆ రోజు నుంచి సభలు, సమావేశాలు నిర్వహించుకుంటే బాగుంటుందని జ్యోతిస్కులు కేసీఆర్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి సిద్ధిపేటలో జిల్లా స్థాయి నేతలతో మంత్రి హరీష్‌ సమావేశం అయ్యారు.