మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే అనిత ఓదార్పు
విశాఖపట్టణం,జూన్7(జనం సాక్షి): పవన్ కళ్యాణ్ ప్లెక్సీ ఏర్పాటుచేస్తూ విధ్యుతాఘాతంతో మృతిచెందిన శివ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే వంగల పూడి అనిత పరామర్శించారు. అకస్మాత్తుగా జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. అభిమాన హీరోకు ప్లెక్సీలు ఏర్పాటుచేస్తూ విధ్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతిచెందటంతో ,వారికుటుంబాలు రోడ్డున పడినట్లయిందని ఎమ్మెల్యే అనిత ఆవేదన వ్యక్తంచేసారు.వీరికి కలిగిన నష్టాన్ని ఎవరూ తీర్చలేనిదన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా నన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా వుంటుందన్నారు. చంద్రన్న భీమాలో భాగంగా దహన సంస్కారాలకు మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే అనిత 5వేల రూపాయలు ధనసహాయం అందించారు. దీంతోపాటు చంద్రన్న భీమా క్లయిమ్ 5లక్షల రూపాయల భీమా పరిహారం అందేందుకు చర్యలు తీసుకుంటున్నానన్నారు. అలాగే మృతుని భార్య విధ్యాధికురాలైనందున ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఏదోచోట ఉపాధి కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిత తెలిపారు.