Thursday, 5 November 2026

మెల్‌బోర్న్‌ వన్డేలో ధావన్‌ ధమాకా


వీరోచిత బ్యాటింగ్‌తో సఫారీలపై సెంచరీ

మెల్‌బోర్న్‌, ఫిబ్రవరి 22: ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో భారత్‌-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దుమ్మురేపాడు. వరల్డ్‌కప్‌ మొదటి మ్యాచ్‌లో పాక్‌పై విరుచుకుపడిన ధావన్‌.. సఫారీలతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ తన వీరోచిత బ్యాటింగ్‌తో సెంచరీ చేసి క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించాడు. సౌతాఫ్రికా బౌలర్లను నిలువరిస్తూ వాళ్లు విసిరే బంతులతో చెడుగుడు ఆడుకున్నాడు. అందివచ్చిన ప్రతీ బాల్‌ను సద్వినియోగం చేసుకుంటూ బౌండరీలకు చేరవేశాడు.

ధావన్‌ క్రీస్‌లో ఉన్నంత సేపూ సఫారీల బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్‌ తొలుత ఆచితూచి ఆడినా.. తరువాత తన ప్రతాపం చూపించాడు. సహచర బ్యాట్స్‌మెన్‌తో కలిసి భారత్‌ స్కోర్‌ పెంచేందుకు కృషి చేశాడు. మొత్తంగా 122 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన ధావన్‌ 137 పరుగులు చేశాడు. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో ధావన్‌కిది తొలి సెంచరీ కావడం విశేషం. సౌతాఫ్రికాపై ఢిల్లీ వాలాకిది రెండో సెంచరీ కాగా.. క్రికెట్‌ కెరీర్‌లో 7వ సెంచరీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *