
వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో క్రికెట్ పసికూనలు పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటిమొన్న వెస్టిండీస్‌ను ఐర్లాండ్ జట్టు మట్టికరిపిస్తే.. ఆదివారం జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టుపై శ్రీలంక జట్టు అష్టకష్టాలు పడి నెగ్గింది.
పూల్ ఏ మ్యాచ్‌లలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘన్ జట్టు నిర్ధేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక అతి కష్టం మీద ఛేదించింది. మొత్తం 48.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘాన్ ఆటతీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీలంక వంటి బలమైన జట్టును ముప్పుతిప్పలు పెట్టిందని పొగడ్తలు వస్తున్నాయి. పెరీరా 26 బంతుల్లో 47 పరుగులు చేయడం లంకకు కలిసొచ్చింది. అంతకుముందు జయవర్థనే 100 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆఫ్ఘాన్ బౌలర్లలో హమీద్ హసమ్ 3, జాద్రాన్, షాపూర్‌లకు చెరో వికెట్ దక్కాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ జట్టు 49.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్లు అహ్మది 24, మంగల్ 10, స్టానికజాయ్ 54, షెన్వారి 38, నబి 21, అష్రాఫ్ 28 చొప్పున పరుగులు చేశారు. లంక బౌలర్లలో మలింగా, మ్యాథ్యూలు మూడేసి వికెట్లు తీయగా, లక్మల్ రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జయవర్ధనేకు దక్కింది.




