Tuesday, 3 November 2026

మొరాయిస్తున్న నీట మునిగిన వాహనాలు

తడిసి మోపెడు అవుతున్న రిపేరు ఖర్చులు
హైదరాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి):  వారంరోజులుగా నగరంలో కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో నీరున ఇలిచి అనేక వాహనాలు మొరాయించాయి. కొత్తగా కొనుక్కున్న వాహనాలు సైతం నీటిలో మునగి, బురదలో కూరుకుపోవడంతో ఇప్పుడు వాటిని బాగుచేయించేందుకు సర్వీస్‌ సెంటర్లకు పరుగులు
తీస్తున్నారు. దీంతో తమ వాహనాలు పనికివస్తాయో రావో అని ఆందోళన చెందుతున్నారు. ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా ఆచితూచి స్పందిస్తున్నాయి. అసలే లోటు బడ్జెట్‌లో ఉన్న మధ్యతరగతి జీవిపై వర్షం మరింత భారాన్ని మిగిల్చింది. రోడ్లపై పలుచోట్ల రెండు నుంచి మూడు అడుగుల లోతు నీళ్లు నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వరద నీరు బైకుల సైలెన్సర్‌, మోటారు, కార్పెట్‌లోనికి వెళ్లడంతో ప్లగ్‌ షార్టేజ్‌, ఎలక్ట్రికల్‌ సమస్యలు వంటివి తలెత్తుతాయి. దాంతో రూ500నుంచి రూ4000 వరకూ ఖర్చుపెడితేగానీ బండి మాములు స్థితికి రాని పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం టూవీర్ల పరిస్తితి మాత్రమే. ఇక ఫోర్‌ వీలర్లకు కూడా దారుణంగా ఖర్చు కానుంది. ఇటీవలి వర్షాలకు, గతంలో కురిసిన వర్షౄలకు అపార్టుమెంట్‌ సెల్లార్లు నీటమునిగాయి.  దీంతో సెల్లార్లలో మునిగిన కార్లన్నీ రిపేరుకొచ్చాయి. అంతేకాదు, వరదనీటిలో ప్రయాణం సాగించినప్పుడు, నీళ్లు కారు మోటారులోకి వెళ్లి ఇంజన్‌ ఆన్‌ కాకపోవడం వంటి సమస్యలతో చాలా వాహనాలు మొరాయించాయి.  నీట మునిగిన కార్లు మా సర్వీస్‌ సెంటర్‌కు వస్తున్నాయని కార్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నారు.  కారు టైరుపైభాగం వరకు నీటమునిగితే, ట్రబుల్‌ తప్పదని ఆయన చెబుతున్నారు. ఇకపోతే  రోడ్లన్నీ గుంతలు తేలి అడుగడుగుకో గుంత దర్శనమిస్తోంది. మరి కొన్ని ప్రదేశాల్లో కంకర, ఇసుక, బీటీ రాళ్లను వెళ్లబెట్టిన రోడ్లు సమస్యాత్మకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గతుకుల రోడ్డుపై వాహనదారుల  ప్రయాణం ప్రహసనంగా మారింది.  ద్విచక్రవాహనదారుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై వెళ్లేప్పుడు మోటారుబైకు స్కిడ్‌ అవ్వడంవల్ల, ప్రమాదాలు తలెత్తుతున్నాయి. దాంతో ద్విచక్రవాహనదారులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ద్విచక్రవాహనంపై ప్రయాణం ప్రమాదాలకు దారితీస్తోంది. గుంతల వల్ల ప్రాణాపాయం తలెత్తే అవకాశం లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంతవాహనం ఉండాలని భావించి అప్పోసొప్పోచేసి బైకు కొన్నవారే ఎక్కువ. నీరు నిలిచిన రోడ్డుపై ప్రయాణించడం వల్ల బండి మొరాయిస్తుంది. బాగుచేయడానికి
తడిసి మోపెడు అవుతోంది.