మోడీ డైరెక్షన్‌లో వైసీపీ, జనసేన
– బాబు రాజీనామా చేయాలనడం ఓ నాటకం
– మోడీనిచూసి చంద్రబాబు భయపడుతున్నాడనటం పెద్ద జోక్
– విలేకరుల సమావేశంలో మంత్రి యనమల రామకృష్ణుడు
అమరావతి, జులై 7(జనం సాక్షి) : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరడం… వైసీపీ, జనసేన, బీజేపీ ఆటలో భాగమే అన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. శనివారం సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఆయన అంతకుముందు విలేకరులసమావేశంలో మాట్లాడారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలంటరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ఎలా ఓడించాలా అనేదే జగన్, పవన్ కల్యాణ్ ఆలోచన అని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ డైరెక్షన్ లోనే వీరిద్దరూ ఏపీలో గోతులు తవ్వుతున్నారని ఆయన ఆరోపించారు. వాళ్లిద్దరూ మోడీ, అమిత్ షాలపై నోరు తెరవరని.. అలాంటి పార్టీలతో టీడీపీ ఎలా కలిసి పోరాటం చేస్తుంది…? అంటూ ప్రశ్నించారు. మోడీని చూసి చంద్రబాబు భయపడుతున్నారంటూ చేస్తున్న విమర్శలు పెద్ద జోక్ అని అన్నారు. 12 ఛార్జ్ షీట్లలో నిందితుడైన జగనే మోడీని చూసి భయపడాలని చెప్పారు. జగన్, పవన్, నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రజల పాలిట దుష్టచతుష్టయంగా మారారని మంత్రి యనమల వివరించారు. వైసీపీ ఎంపీల రాజీనామా వల్ల ఏం ప్రయోజనం వచ్చిందని నిలదీశారు. పోరాటంలో ముందుండాలని… పారిపోవడం వీరత్వం కాదని మంత్రి యనమల వ్యాఖ్యానించారు.
——————————–