న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్న మోడీ మేక్ ఇన్ ఇండియా పేరుతో కోట్ల రూపాయలను వృధా చేశారని మండిపడ్డారు. ఇవాళ న్యూఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాగానే దేశంలో ధరలను తగ్గిస్తామని హామీల మీద హామీలిచ్చారని.. ఈ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో చేసిన ప్రచారంలో మోడీ ధరించిన సూటు ఖరీదే రూ.10 లక్షలు ఖరీదుంటుందని..దీనిని యూకేలో తయారు చేయించారని ప్రజలకు తెలియజేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్రహోదాను తీసుకవస్తామని ఆయన ప్రజలకు హామీనిచ్చారు. మీరు మోడీ నుంచి గానీ, కేజ్రీవాల్ నుంచి ఎలాంటి అభివృద్ధిని పొందలేరన్నారు. హామీలివ్వడం చాలా సులభమని.. కానీ వాటిని అమలు చేయడం కష్టతరమైందని అన్నారు. మోడీ కార్యక్రమాలు ఆయన స్నేహితులైన కొంతమంది వ్యాపారవేత్తలు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే రూపకల్పన చేయబడ్డాయని ధ్వజమెత్తారు.




