మోదీ సర్కార్ ఎజెండా ఆరెస్సెస్ జెండా
రాహుల్ విసుర్లు
న్యూఢిల్లీ,మే28(జనంసాక్షి) : మోదీ సర్కారు ఆరెస్సెస్ ఎజెండాతో పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరి అభిప్రాయాలను కాంగ్రెస్ వింటుందని, ఆర్‌ఎస్‌ఎస్ , బీజేపీ మాత్రం తాము చెప్పిందే అందరూ వినాలని శాసిస్తాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా బ్లాక్ మనీని వెనక్కి తీసుకొచ్చే విషయాన్ని పక్కన పెట్టారన్నారు. రైతాంగంతో పాటు విద్యారంగాన్ని విస్మరించిన మోడీ? సూట్లపై దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల వర్షం పెంచారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలవడాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ మన్మోహన్ సింగ్ నుంచి నరేంద్రమోదీ దేశంలోని ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పాఠాలు నేర్చుకున్నారని చెప్పారు. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటంతో దాదాపు గంటపాటు తమ మాజీ ప్రధానితో భేటీ అయ్యి పాఠాలు నేర్చుకున్నారని చెప్పారు. ఢిల్లీలో ఎన్‌ఎస్యూఐ కన్వెన్షన్లో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్పై విరుచుకుపడ్డారు. ఎవరు చెప్పినా వినే డీఎన్‌ఏ కాంగ్రెస్ పార్టీకి ఉందని కానీ, ఆరెస్సెస్ చెప్పిందే ఎవరైనా వినాలని చెప్పే లక్షణం మాత్రం బీజేపీకి ఉందని విమర్శించారు. ఆరెస్సెస్ సిద్ధాంతాలను ప్రజలపై రుద్దాలని మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ విదేశాలు తిరుగుతారు కానీ, రైతుల సమస్యలు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగోలియా వెళ్లేందుకు ఆయనకు సమయం ఉంటుందికానీ, రైతుల ఇంటికి వచ్చి వారిని పరామర్శించేందుకు ఆయనకు తీరిక లేకుండా పోయిందని చెప్పారు. కొత్తగా ఏర్పాటయిన బీజేపీ ప్రభుత్వం తప్పుల విూద తప్పులు చేస్తోందని, అన్ని వర్గాలను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఏడాది కావొస్తున్నా.. ఇంకా నల్లధనం వెలికి తీయలేకపోయారని విమర్శించారు. మేకిన్ ఇండియా పనిచేయట్లేదని ఆయన విమర్శించారు. ఇది పెద్ద వైఫల్యంగానే మారిపోతుందని జోస్యం చెప్పారు. నల్లధనం విూద విచారణ ఎంతవరకు వచ్చిందని, అసలు ఏడాదిలో తెప్పిస్తానన్న నల్ల ధనం ఏదని ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌యూఐ వర్గాలు ఆరెస్సెస్తో పోరాడి తీరాలని ఉద్బోధించారు.