ఘనంగా స్వాగతం పలికిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి, డిసెంబర్9(జనంసాక్షి) : గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సోమవారం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గవర్నర్ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆలయ ఈవో, అధికారులు, వేద పండితులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గవర్నర్‌కు వివరించారు. తొలిసారి యాదాద్రి ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి ఘనంగా ఏర్పాట్లు చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆలయ ఇవో గీత, కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులు స్వాగతం పలికారు. గవర్నర్ రాకతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. మరోవైపు తమిళిసై వరంగల్ నగరానికి చేరుకొని అక్కడ కాకతీయుల కోటలోని చారిత్రక కట్టడాలను పరిశీలించారు.




