యువతి ఆత్మహత్య

విశాఖపట్నం(జ‌నం సాక్షి ) : నగరంలోని ఓ వృద్ధ దంపతుల ఇంట్లో పనిచేస్తున్న యువతి అదే ఇంట్లో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. ఇందుకు సంబంధించి మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. సిరిపురం సమీపంలోని బాలాజీనగర్‌లో నాట్ల గోపాలకృష్ణ (88), నాట్ల అనసూయ (84) దంపతులు నివాసముంటున్నారు. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడడంతో వృద్ధ దంపతులు ఇద్దరే ఇంట్లో వుంటున్నారు. వీరికి ఇంట్లో పనులు చేయడంతోపాటు సహాయంగా ఉండేందుకు విజయనగరం జిల్లా పాచిపెంటకు చెందిన చీమల దివ్య (19) అనే యువతితో పాటు రాయల కమల అనే మరొక మహిళ ఉంటున్నారు. కమల ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి తన ఇంటికి వెళ్లిపోగా, దివ్య మాత్రం వృద్ధ దంపతులతో కలిసి అదే ఇంట్లో ఉంటోంది. దివ్య తల్లిదండ్రులు కూడా ఉపాధి కోసం నగరానికి వచ్చి ప్రస్తుతం మాధవధారలో వుంటున్నారు. నాలుగు నెలల కిందటే దివ్యను పనిలో పెట్టారు. ఇదిలావుండగా దివ్య శుక్రవారం ఉదయం తన తండ్రి కృష్ణకు ఫోన్‌ చేసి చాలాసేపు మాట్లాడింది.
 కాగా, శనివారం ఉదయం 11 గంటల సమయంలో దివ్య స్నానం చేయకుండా హాల్లో కూర్చోవడంతో అనసూయ వచ్చి స్నానం చేసి రావాలంటూ దివ్యకు సూచించింది. దివ్య స్నానానికి వెళ్లి 12 గంటల వరకూ రాలేదు. తినడానికి ఏమైనా పెట్టాలంటూ దివ్యకు గోపాలకృష్ణ చెప్పారు. దివ్య పలకకపోవడంతో ఆమె వుంటున్న గదిలోకి వెళ్లి చూడగా, ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన గోపాలకృష్ణ దంపతులు పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీమ్‌ అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్య కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ సతీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఇమాన్యుయేల్‌రాజు తెలిపారు.