Wednesday, 4 November 2026

యువతి రేప్‌..సజీవ దహనం

కేసులో 16మంది అరెస్ట్‌
రాంచీ,మే5(జ‌నం సాక్షి):  ఝార్ఖండ్‌లో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, సజీవ దహనం కేసులో పోలీసులు 16మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలోని ఛత్రా జిల్లాలో శుక్రవారం దుండగులు బాలిక
ఇంట్లో ఉండగా దాడి చేసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజు రాత్రి నలుగురు మృగాళ్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంపై బాలిక తండ్రి గ్రామ పెద్దకు ఫిర్యాదు చేయడంతో దుండగులు కోపంతో బాధితిరాలి ఇంటిపై దాడి చేసి ఆమెను అతి దారుణంగా చంపేశారు. ఇటీవల అమ్మాయిలపై పలు అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు 20మందిపై కేసు నమోదు చేశారు. వారిలో పదహారు మందిని అరెస్ట్‌ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. గురువారం రాత్రి నలుగురు వ్యక్తులు తన కూతురుని అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని యువతి తండ్రి ఫిర్యాదులో తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లామని, తన కూతురు ఒక్కతే ఇంటి దగ్గర ఉందని చెప్పారు. కిడ్నాప్‌ చేసినప్పుడు వారు మద్యం సేవించి ఉన్నారని పేర్కొన్నారు. యువతి తండ్రి గ్రామ పెద్దలను ఆశ్రయించగా ఆ యువకులకు వంద గుంజీళ్లు, రూ.50వేల జరిమానా విధించారని తెలిపారు. దీంతో కోపంతో వారు బాధితురాలి ఇంటిపై దాడి చేసి తల్లిదండ్రులను కొట్టి ఆమెను సజీవ దహనం చేశారని యువతి కుటుంబసభ్యులు వెల్లడించారు.