హైదరాబాద్,జూన్18(జనం సాక్షి): బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌తో పాటు మరికొన్ని సంస్థలను… అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ తీవ్రవాద మత సంస్థలుగా అభివర్ణించింది. ఆరెస్సెస్‌ను రాజకీయ ఒత్తిడి బృందంగా వర్గీకరించింది. రాజకీయాల్లో ఉంటూ రాజకీయపరమైన ఒత్తిడిని కలిగిస్తూ ఎన్నికల్లో పోటీ చేయని సంస్థలను రాజకీయ ఒత్తిడి బృందాలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నేతలు ఆందోళన చేపట్టారు. ముందస్తుగా నగరంలోని పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేట అమెరికన్ కాన్సులేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.




