Tuesday, 3 November 2026

రబీ పంటకు ప్రణాళిక

untitled-1222

– మంత్రి హరీశ్‌రావు సమీక్ష

హైదరాబాద్‌,అక్టోబర్‌ 13(జనంసాక్షి):రబీ పంటకు అవసరమైన సాగునీటి కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా ఖరారు చేయాలని టి. ఎస్‌.నీటిపారుదల మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు. రెండు విడతలలో చేపట్టిన మిషన్‌ కాకతీయ ను సమగ్రంగా సవిూక్షించాలని మంత్రి నిర్ణయించారు. ప్రాధాన్యతా పరంగా ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.  గురువారం నాడిక్కడ జల సౌధలో ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న చీఫ్‌ ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం జరపాలని మంత్రి నిర్ణయించారు.అన్ని ప్రాజక్టులు, జలాశయాలు, చెరువులు నిండినందున ఒక్క చుక్కనీరు కూడా వృధా పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చిట్టచివరి రైతుకు సైతం నీరందేలా ప్రణాళిక రచించి అమలు చేయాలని మంత్రి హరీష్‌ రావు కోరారు. మొన్నటి ఖరీఫ్‌ లో ఏయే ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు సాగునీరందించారనే విషయమై ఇంజనీర్లు సమర్పించిన నివేదికలను మంత్రి సవిూక్షించారు. శ్రీరామ్‌ సాగర్‌ స్టేజ్‌ 1 , స్టేజ్‌ 2 , వరద కాలువ, నాగార్జునసాగర్‌, శ్రీశైలం, నిజాంసాగర్‌, ఎల్లంపల్లి, సింగూరు, మూసి, కడెం, జూరాల తదితర ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్‌ పంటకు జరిగిన సాగునీటి సరఫరాను మంత్రి అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ సాగర్‌ నుంచి 9 లక్షల  ఎకరాలకు సాగునీరు అందించవలసిందేనని మంత్రి ఆదేశించారు. ఎస్‌ఆర్‌ఎస్‌ పి స్టేజ్‌ 1 లో మిగిలిపోయిన కాలువల మరమ్మత్తులు, ఇతర పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద రెండో పంటకు 6 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరివ్వాలని కోరారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. సాగర్‌ ఎడమ కాలువకు సంబంధించిన పెండింగ్‌ పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేయాలన్నారు. నాగార్జునసాగర్‌ లోలెవల్‌ కెనాల్‌ డచ39;వె?ట్‌ రన్‌డచ39;  ను ఈ నెలాఖరులో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్‌ రావు కోరారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఎత్తిపోతల పథకాల ద్వారా గత మూడేళ్ళుగా జరిగిన, జరుగుతున్నఎత్తిపోతలను ,  ఆయకట్టును , నింపుతున్న చెరువుల సంఖ్యను  సవిూక్షించాలని, ఈ మేరకు డేటా సేకరించాలని కోరారు. ఆన్‌ గోయింగ్‌ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాలమూరు జిల్లాలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని మంత్రి అన్నారు. ఈసారి భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలయి గోదావరిలోకి వృధాగా నీరు పోతున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీటితో వీలైనంత మేరకు చెరువులన్నింటినీ నింపాలని హరీష్‌ రావు ఆదేశించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని  చెరువులను పూర్తిగా  నింపాలని కోరారు. ఇటీవల వరదల నియంత్రణ సమంవయంతో జరిగిందని మంత్రి అన్నారు. అయితే సింగూరు , నిజాం సాగర్‌ ప్రాజెక్టుల గేట్లలో కొన్ని ఇబ్బందులు తలెత్తినాయని అన్నారు. అటువంటి ఇబ్బందులు భవిస్యత్తులో రాకుండా ఉండాలంటే  వర్షాకాలం రావడానికి ముందే ప్రాజెక్టుల గేట్ల  పనితీరును క్షుణంగా పరిశీలించాలని, ఆయా గేట్లు సక్రమంగా లేకపోతే మరమ్మత్తులు చేపట్టాలని మంత్రి కోరారు. తప్పనిసరిగా ప్రతి డ్యామ్‌ ను ప్రీ మాన్‌ సూన్‌ తనిఖి చేయాలని, డ్యామ్‌ సేఫ్టీ పై నివేదికలు ప్రభుత్వానికి ఇవ్వాలని హరీష్‌ రావు కోరారు. వివిధ ప్రాజెక్టుల కాలువల నిర్వహణ కోసం ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించడమా? లేక వార్షిక మెయిన్‌ టెన్స్‌ కాంట్రాక్టు ఇవ్వడమా? వంటి అంశంపై దేశంలో, మిగతా రాష్ట్రాలలో

సాగునీటి రంగంలో వున్న అత్యున్నత ప్రమాణాలతో ఆచరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని ఇరిగేషన్‌ ఇంజనీర్లను మంత్రి హరీష్‌ సూచించారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామ, భక్త రామదాసు, నల్లగొండ జిల్లాకు చెందిన డిండి తదితర  ప్రాజెక్టుల పనుల పురోగతి, భూసేకరణ పనులను  మంత్రి ఈ సమావేశంలో సవిూక్షించారు. సీతారామ ప్రాజెక్టు కోసం  1700 ఎకరాల భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేసి పనులు  ప్రారంభించాలని ఆదేశించారు. కాలువలు, డిజైన్లు , అంచనాలు పూర్తయినందున రోళ్లపాడు వరకు మరో వారంలో టెండర్లు  పిలిచేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 18 న జరిగే సి.ఇ. ల సమావేశంలో ప్రాజెక్టుల వారీగా రబీ పంటకు వున్న నీటి లభ్యత, మిషన్‌ కాకతీయ ఫలితాలు, మూడో దశలో చేపట్టే  పనులు ,  తదితర అంశాలపై క్షుణంగా సవిూక్షించాలని మంత్రి హరీష్‌ రావు నిర్ణయించారు. పూర్తి వివరాలతో  ఆ రోజు

సమావేశానికి హాజరుకావాలని చీఫ్‌ ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇఎన్సిలు సి.మురళీధర్రావు , విజయప్రకాష్‌, సి.ఇ లు హరిరామ్‌, సునీల్‌, అనిల్‌, సుధాకర్‌, శంకర్‌,శ్యాంసుందర్‌ ,  కమిషనర్‌ డాక్టర్‌ మల్సూర్‌, ఓఎస్డి శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *