రమణదీక్షితులువెనక ఎవరున్నారు: కంభంపాటి

విజయవాడ,మే17(జ‌నం సాక్షి ):  తిరుపతి తిరుమల దేవస్థానంపై రమణ దీక్షితులు మాట్లాడటం చాలా అనుమానాలను కలిగిస్తుందని తెదేపా అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ వ్యాఖ్యానించారు. ఓ ప్రధాన అర్చకుడిగా ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేవస్థాన పవిత్రతకు భంగం కలుగుతుందని ఆయన అన్నారు. గుంటూరు ఘటనలో కొంతమంది అరాచక శక్తులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ.. బోటు ప్రమాద ఘటన స్థలానికి రాలేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతకు శుక్రవారం కోర్టుకి వెళ్లడానికి టైం ఉంది కానీ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడానికి సమయం ఉండటంలేదని ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా ప్రభుత్వ కుట్ర అనే సంస్కృతి జగన్‌దేనన్నారు. రమణదీక్షితులు వెనుక భాజపా, వైకాపా ఉన్నాయనే అనుమానం తమకు ఉందన్నారు. ఏదైనా అజెండా ఉంటే ఏదో ఒక పార్టీలో చేరి మాట్లాడాలని కంభంపాటి సూచించారు.

తాజావార్తలు