రమణదీక్షితులు నాటకం వెనుక మోదీ, అమిత్‌షా
– టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు
– పింక్ డైమండ్ లేదని జడ్జీల కమిటీ ప్రకటించాయి
– రూబీ ముక్కలైందని ఐవైఆరే నిర్దారించారు
– అసత్య ఆరోపణలతో టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీయద్దు
– విలేకరుల సమావేశంలో ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ ఆనంద్‌సూర్య
హైదరాబాద్ , మే25(జనంసాక్షి) : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రతిష్టకు భంగం కలిగించేలా రమణ దీక్షితులు వ్యవహరిస్తున్నారని, ఆయన వెనుక మోదీ, అమిత్‌షాలు ఉన్నట్లు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ బ్రహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. శుక్రవారం ఆయన విూడియా ప్రతినిధులతో మాట్లాడారు. రమణ దీక్షితులు ఆగమ శాస్త్ర విలువలను మంటగలిపరంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్చకులను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నుంచి దూరం చేయడానికి రమణ దీక్షితులు యత్నిస్తున్నారని ఆరోపించారు. తోటి అర్చకులను రమణదీక్షితులు కష్టనష్టాలకు గురి చేశారన్నారు. అన్యమతస్థుడైన కరుణాకర్‌రెడ్డి ఇంటికెళ్లి ఆశీర్వచనం అందించారని, అన్య మతస్తులకు రమణ దీక్షితులు అమ్ముడుపోయారని ఆనంద్ సూర్య ఆరోపించారు. 2013లో అనేక మంది అర్చకులు పదవీ విరమణ చేయలేదా?…రమణదీక్షితులు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బ్రాహ్మణులను టీడీపీకి దూరం చేయాలనేదే బీజేపీ, వైసీపీ కుట్ర అని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని ఆనంద సూర్య అన్నారు. ఐవైఆర్ కృష్ణారావు రాజధానిపై విషం కక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ఐవైఆర్, రమణ దీక్షితులపై కేసులు పెట్టడానికి సిద్దంగా ఉన్నామని ఆనందసూర్య తెలిపారు. ఆంధప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నమ్మక ద్రోహి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పింక్ డైమండ్ అనేదే లేదని జడ్జీల కమిటీలు ప్రకటించాయని చెప్పారు. రూబీ
ముక్కలైందని విూరే కదా నిర్ధారించారు అంటూ ఐవైఆర్‌ను నిలదీశారు. రమణదీక్షితులు నాటకం వెనుక మోదీ, అమిత్ షా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి పోటు దగ్గర రిపేర్లు చేస్తున్నప్పుడు 2వ ప్రాకారంలో వంట చేయొచ్చని చెప్పింది రమణ దీక్షితులేనని వెల్లడించారు. అసత్య ఆరోపణలతో టీటీడీ పరువును తీయవద్దని, ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని సూర్య విజ్ఞప్తి చేశారు.