Tuesday, 3 November 2026

రాజకీయ నేతలను నిందించడం సరికాదు

ప్రజల్లో చైతన్యం రావాలి..నిష్పక్షపాతంగా ఓటేయాలి

తమది అంపైర్‌ పాత్ర మాత్రమే

ఎన్నికల నిఘా సమావేశంలో రజత్‌ కుమార్‌

హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికలు జరుగుతన్న వేళ ప్రతిసారీ రాజకీయ నాయకుల్ని నిందించడం సరికాదని.. ప్రజల్లో, ఓటర్లలో చైతన్యం రావాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ చెప్పారు. ప్రజలు జాగురూకతతో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందన్నారు. తాము మ్యాచ్‌ లో అంపైర్ల లాంటివాళ్లం మాత్రమే అని అన్నారు. ఎవరైనా చట్ట ప్రకారం పోరాటం చేయాలన్నారు . పోరాటం అంటే రాళ్ళతో కొట్టడం, అడ్డుకోవడం కాదని.. చర్చలు చేయడం, అవగాహన కల్పించడమని చెప్పారు. తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రజత్‌ కుమార్‌ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా నిస్వార్థంగా ఓటేయ్యాలని కోరారు. ఓటింగ్‌ పై ప్రజలకు చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిఘా చాలా అవసరమని రజత్‌ కుమార్‌ తెలిపారు. అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లినట్టు తెలిపారు. ఈ పర్యటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఖమ్మంలో బతుకమ్మ చీరల పంపిణీపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్‌ కోసమే వచ్చినట్టు ఇరు రాష్ట్రాల డీజీలు నివేదిక ఇచ్చారని తెలిపారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులతో గురువారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు ఆయన తెలిపారు. మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల బందోబస్తుకు కేంద్రం నుంచి అదనపు బలగాలు రాష్ట్రానికి రానున్నుట్టు తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.