– ఊపిరిపోయే వరకు నిజాయితీ రాజకీయాలే చేస్తా
– తుని రైలుదహనం ఘటన బాధాకరం
– అది జరగడానికి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది
– స్వచ్చమైన రాజకీయాలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలి
– జనసేన అధినేత పవన్ కళ్యాణ్
– తుని నియోజకవర్గ జనసేన నాయకులతో సమావేశమైన పవన్
కాకినాడ, నవంబర్3(జనంసాక్షి) : రాజకీయ నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తుని నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక అవినీతిపరుడు తన అవినీతి సొమ్ముతో సినిమా తీయమని నన్ను అడగడం నాకు నచ్చలేదన్నారు. సినిమాల ద్వారా ఆశించినంత మార్పు రాదని, మార్పు రాజకీయాల ద్వారానే సాధ్యమన్నారు. కుటుంబసభ్యులను ఇబ్బందిపెట్టి 2014లో తెలుగుదేశంకు మద్దతిచ్చానన్నారు. ఊపిరి పోయే వరకూ నిజాయితీ కూడిన రాజకీయాలే చేస్తానన్నారు. దేశ సరిహద్దుల్లో దేశంకోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులు నాకు ఆదర్శమన్నారు. మా అమ్మనాన్ను దేశానికి దత్తత ఇచ్చేసిందన్నారు. నన్ను ఆశీర్వదించడానికి మా అమ్మకి ఒకటిన్నర దశాబ్దం పట్టిందన్నారు. ఆమె దాచుకున్న నాలుగున్నర లక్షలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిందన్నారు. సాక్షాత్తు మన ఎంపీలను పార్లమెంట్లో కొడితే నేను చాలాబాధపడ్డానన్నారు. కులాలకు, మతాలకు అతీతమైన రాజకీయం చేయాలన్నారు. అనుభవమున్న వ్యక్తి కనుకనే 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చాన్నారు. పంచాయితీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ బాధ్యత గల రాజకీయాలు చేసే విధానం రావాలని జనసేన అధినేత పవన్ అన్నారు. అభిమానుల కేరింతలు, చప్పట్లు నేను తలకు ఎక్కించుకోనని, అది బాధ్యత గా భావిస్తానన్నారు. సమాజాన్ని, అంబేడ్కరిజాన్ని పూర్తిగా నింపుకున్నవాడినన్నారు. ఓడిపోవడానికైనా సిద్ధమే కానీ, విలువలు కోల్పోవడానికి సిద్ధంగా లేనన్నారు. 25కేజీల బియ్యం కాదు కావాల్సింది,
ఐదేళ్లు బాధ్యత గల జీవితం ఇవ్వాలన్నారు. తుని రైలు దహనం ఘటన బాధాకరమన్నారు. అది జరగడానికి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందన్నారు. జాత్యహంకారానికి గురైన ఒక వ్యక్తి పట్టుదలతో మనకి స్వాతంత్యం సిద్దించిందన్నారు. అంతటి పట్టుదల మన కార్యకర్తలలో ఉండాలన్నారు. మా తాత పెనుగొండ లో ఒక పోస్ట్ మాస్టర్ అని, మా నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్ అని, దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినవాడినని తెలిపారు. సరికొత్త రాజకీయ విధానం తీసుకుని రావాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఉత్సాహం అవసరమే కానీ మన వెనుక బృహత్తర బాధ్యత ఉందన్నారు. ఒక ఏడాదికోసమో, ఒక ఎన్నికల కోసమే మన పార్టీ ఏర్పడలేదన్నారు. ఒక అప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్రాన్ని విభజించారన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కొన్ని బీసీ కులాలని ఒక్క సంతకంతో తొలగించి ఓసిలుగా చేశారన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతమైన రాజకీయాలు చేసే నాయకులను ప్రోత్సహించాలని, అలా జరిగినప్పుడు సమాజం పరిపూర్ణంగా అభివృద్ధిజరుగుతుందని పవన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ నేతలు… ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి




