Monday, 2 November 2026

రాజకీయ పునరేకీకరణ దిశగా పరిణామాలు

కేంద్రం తీరుతో పోరాటమే శరణ్యమని ప్రకటించిన కెసిఆర్‌
రైతు ఉద్యమాలతో మారనున్న జాతీయ రాజకీయాలు
కెసిఆర్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అయ్యేలా కార్యాక్రమాలు
హైదరాబాద్‌,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): దేశంలో రాజకీయ పునరేకీరణపై చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ సిఎం కెసిఆర్‌ మరోమారు తన ధృడ సంకల్పాన్ని ప్రకటించారు. మొన్నటి వరకు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేసి కేంద్రాన్ని నిలదీసిన కెసిఆర్‌ ..కేంద్రం తీరుతో ఇక తెలంగానలో ప్రభుత్వమే ధాన్యం కొంటుందని ప్రకటించారు. ఇదే సందర్భంలో మోడీపై యుద్దాన్ని ప్రకటించారు. దక్షిణాది నుంచే దండయాత్ర అంటూ తన కార్యాచరణ మొదలు పెట్టాడు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో మరోపార్టీకి అవకాశం లేదు. అలాగే కెసిఆర్‌కు తెలంగాణలో తిరుగు లేదు. అంతేగాకుండా ఆయన పట్ల ప్రజల్లో పెద్దగా వ్యతిరేకతా లేదు. అలాగని కాంగ్రెస్‌ ఊరూరా తిరుగుతున్నా దానిని నమ్మేస్థితి లేదు. బిజెపి,కాంగ్రెస్‌లు కెసిఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా పెద్దగా ఫలితం ఉంటుందా అన్నదే అనుమానం. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పొలిటికల్‌ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి కూడా ఇప్పటికీ ప్రభావం చూపలేక పోతోంది. నాలుగేళ్ల క్రితం వరకు భారతీయ జనతాపార్టీ అంటే ప్రజలకు అభినమానం ఉండేది. పెట్రో ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు, కార్పోరేట్‌ పెద్దలకు ఊడిగం వంటి అంశాల కారణంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారింది. ఈ దశలో తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. జాతీయస్థాయి ప్రత్యామ్నాయ వేదికల ఏర్పాటు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో అనేక సవిూకరణలపై చర్చ సాగుతోంది. మరో వైపు ఇటీవల యూపి ఎన్నికల్లో బిజెపి గెలిచినా అదంతా యోగగి ఆదిత్యనాథ్‌ చలవేనని అంటున్నారు. దేశంలోని ఇతర రాష్టాల్ర రాజకీయాలతో పోలిస్తే తెలంగాణ లో పరిస్థితి కొంత వేరుగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత అస్సలే ఏవిూ అభివృద్ది జరగలేదని కాంగ్రెస్‌, బిజెపిలు చేస్తున్న ప్రచారాలు వాస్తవదూరంగా ఉన్నాయి. కెసిఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవమే అయినా ప్రజోపయోగ పనుల విషయంలో కూడా కఠినంగానే ముందుకు వెళుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు పూర్తికావడంతో పాటు మల్లన్నసాగర్‌,కొండపోచ్చమ్మ సాగర్‌, రంగనాయకసాగర్‌ లాంటి అతిపెద్ద జలాశయాలు కళ్లకు కనిపిస్తున్న అభివృద్దిలో భాగంగా చూడాలి. మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లా పలకరించ బోతున్నది. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్దరణ గ్రామాల్లో మార్పును తీసుకుని వచ్చింది. సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ప్రజలను ఆకట్టు కోవడానికి నిరంతరంగా ప్రయత్నం జరుగుతోంది. దళితబంధును కూడా మెల్లగా పట్టాలకు ఎక్కించారు. నియోజక వర్గాల్లో ఈ పథకం ఊపందుకుంది. తెలంగాణలో నిరంతర విద్యుత్‌, సాగునీటి సరఫరా తదితర పథకాలు లక్ష్యంగా తనదైన మార్గంలో కెసిఆర్‌ వెళుతున్నారు. ఈ దశలో అన్నిపార్టీలు మట్టి కరిచాయి. దీంతో జాతీయరాజకీయాల్లో కూడా గుణాత్మక మార్పు కోసం ప్రత్యామ్నాయ వేదికను తెరపైకి తెచ్చారు. దక్షిణాదినుంచే ఇందుకు శ్రీకారం చుడతామని అన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగగవేసి జారుకున్న వారిని అరెస్టు చేయకుండా సిబిఐ అధికారులను వెనక్కి పిలిపించారని సిఎం కెసిఆర్‌ ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాలు బయట పెడతామని అన్నారు. అలాగే జాతీయ వ్యవసాయవిధానంపై హైదరాబాద్‌ లో సదస్సు నిర్వహిస్తామని అన్నారు. ఇవన్నీ కూడా ప్రత్యమ్నా రాజకీయాలు ప్రారంభించే ముందు బిజెపి
వైఫల్యాలను ఎత్తి చూపడానికి పనికి వస్తాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న పరిస్తితుల్లో కెసిఆర్‌ లాంటి నేతను ఢీకొనడం తెలంగాణలో ఇతర పార్టీలకు అసాధ్యం కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నట్లుగా కెసిఆర్‌పై ప్రజల్లో ఎక్కడా అంత వ్యతిరేకత కనిపించదు. నిరంతర కరెంట్‌ కెసిఆర్‌ సాధించిన అతిపెద్ద విజయం. ఇప్పుడు రైతుబంధు కింద ఎకరాకు నాలుగు వేల సాయం అన్నది కూడా గ్రావిూణ ఆర్థిక వ్యవస్తను ప్రభావితం చేసే అంశం. దళితబంధు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కూడా ఓ పెద్ద విజయం కానున్నాయి. ఇక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌ , దానితో పాటు ఇతర ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి రావడంతో తెలంగాణకు ప్రధాన సమస్యగా ఉన్న నీటి సమస్య ఉండబోదు. కానీ మార్పు రావాలని, రాజకీయాలు మారాలని నిర్ణయించుకున్న కెసిఆర్‌ తన పంథాను దేశ ప్రజల ముందుకు ఏ విధంగా తీసుకుని వెళతారన్నది చూడాలి. కెసిఆర్‌ అనుకున్నట్లుగా ప్రణాళిక రచనలె ప్రశాంత్‌ కిశోర్‌ కూడా తోడయ్యారు.