Tuesday, 3 November 2026

రాజధానిలో దళిత బాలికలకు రక్షణ లేదు

– దళితులపై కేసీఆర్‌ ముసలికన్నీరు కారుస్తున్నారు
– ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ
హైదరాబాద్‌, జులై2(జ‌నం సాక్షి ) : రాష్ట్రంతో పాటు రాజధానిలోనూ దళిత బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్పార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఆదర్శ్‌నగర్‌ బిర్లాటెంపుల్‌ సవిూపంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని సోమవారం ఉదయం మందకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులపై కేసీఆర్‌ ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఇప్పటి వరకు నమోదు అయిన ఎస్సీఎస్టీ కేసులపై ఓ మానిటరింగ్‌ కమిటీ వేసి దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో ఇటువంటి అఘాయిత్యం జరిగితే కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ బాధిత కుటుంబాన్ని పరమర్శించక పోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మందకృష్ణ డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌ ఆ మాట మరిచారని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ ఈ పథకం అమలవుతున్నట్లు కనిపించటం లేదన్నారు. కేవలం కుట్రపూరితంగానే దళితులను అణగదొక్కేందుకు కేసీఆర్‌ వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం దళిత వ్యతిరేఖ చర్యలతో పాలన సాగుతుందని, వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నేతలు పాల్గొన్నారు.
——————————