Wednesday, 4 November 2026

రాజధానిలో మరో రైతు ఆత్మహత్య

odnzl2gmహౖదరాబాద్‌ : రాజధాని నడిబొడ్డున మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్నటికి మొన్న పరిపాలనా కేంద్రమైన సచివాలయ సమీపంలో లింబయ్య అనే రైతు ఉరేసుకోగా… ఇప్పుడు బేగంపేటలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలోని చెట్టుకు జగ్గోళ్ల మల్లేశం (58) అనే రైతు బలవన్మరణం పాలయ్యారు. రైతు దర్పానికి చిహ్నమైన తలపాగాకు చిరుగులు పడగా… అదే తలపాగాతో ఉరి బిగించుకున్నాడు. మూడేళ్లుగా తీవ్ర వర్షాభావం.. వరుస అప్పులు.. వడ్డీ వ్యాపారుల వేధింపులకు తల వంచాడు! మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం రాంసాగర్‌ గ్రామానికి చెందిన మల్లేశానికి భార్య సుశీల, కుమారుడు మల్లేశ్‌, ఇద్దరు కుమార్తెలు. హక్కుల సాధన కోసం 15 ఏళ్ల కిందటే తుపాకీ పట్టాడు. ఇందూప్రియాల్‌ దళంలో చేరాడు. దాదాపు ఆరేళ్లపాటు దళంలో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ, తాను ఆశించిన స్వరాజ్యం అడవిలో లేదని గుర్తించి లొంగిపోయాడు. నాగలి పట్టాడు. తనకున్న మూడెకరాల్లో బోర్లు వేశాడు. నీరు పడలేదు. పంటలు పండకపోవడంతో అప్పుల పాలయ్యాడు. గత ఏడాది ఒక ఎకరం అమ్మేసి, కొన్ని అప్పులు తీర్చాడు. మిగిలిన రెండు ఎకరాల్లో మూడేళ్లుగా మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. కరువు పరిస్థితులతో మొక్కజొన్నఆశించిన దిగుబడి రాలేదు. అప్పులు పెరిగిపోయాయి. ఇటీవలే రెండో కుమార్తె పెళ్లికి రూ.3 లక్షలు అప్పుచేశాడు. పంటకు పెట్టిన లక్షన్నర అప్పుతోపాటు కొడుకు చేసిన రెండు లక్షలు.. మొత్తం ఆరున్నర లక్షల అప్పు మోయలేని భారంగా మారింది.అప్పులోళ్ల ఒత్తిడి పెరిగింది. గౌరవం పొందిన చోటనే అవమానం ఎదుర్కోవాల్సి వస్తోందని మనోవ్యథకు గురయ్యాడు. కూలో నాలో చేసి అయినా అప్పులు తీర్చాలని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు.
బుధవారమే నగరానికి సాగుతో బతుకు ముందుకు సాగదని గుర్తించాడు.
హైదరాబాద్‌ చేరి ఏ కూలి పని చేసైనా అప్పులు తీర్చాలని భావించాడు. బుధవారం హైదరాబాద్‌కు వచ్చాడు. అల్వాల్‌లో ఉంటున్న బావమరిది శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లాడు. తనకు కొంత అప్పు కావాలని కోరాడు. అయితే అప్పటికే అతనికి బకాయిపడి ఉండటంతో అప్పు ఇచ్చేందుకు శ్రీనివాస్‌ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో, నిన్నటి వరకూ రైతుగా తలెత్తుకు తిరిగి ఆరు పదుల వయసులో కొంపల్లిలో ఓ ఇంటికి గురువారం సెక్యూరిటీ గార్డుగా విధుల్లోకి చేరాడు. శనివారం రాత్రి సెక్యూరిటీ యూనిఫాంతో బేగంపేటలోని బాలంరాయి పంప్‌హౌజ్‌ పక్కనే ఉన్న చెట్టుకు కండువాతో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బేగంపేట ఎస్సై రవీందర్‌కు ఘటనాస్థలిలో మొబైల్‌ దొరికింది. దాని ఆధారంగా మల్లేశం కొడుకు మల్లేశ్‌కు సమాచారం చేరవేశారు.తండ్రి ఆత్మహత్యకు వ్యవసాయానికి చేసిన అప్పులే కారణమని మల్లేశ్‌ తెలిపాడు. ఐదేళ్లుగా పంటలు సరిగా పండడం లేదని, అదే సమయంలో చెల్లెళ్లకు పెళ్లి చేయటంతో అప్పుల భారం మరింత పెరిగిందని, వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ వారం రోజులుగా మనోవ్యథకు గురవుతున్నాడని తెలిపాడు. హైదరాబాద్‌ వచ్చి ఏదో ఒక పని చేస్తానని చెబుతున్నాడని, అయితే ఇక్కడకు వచ్చిన సంగతి పోలీసులు ఫోన్‌ చేసేంత వరకూ తెలియదని చెప్పాడు. సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ అప్పు ఉండవచ్చనివివరించాడు. వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేకనే తన తండ్రి మరణించాడని మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం రైతు ఆత్మహత్యగా కేసునమోదు చేయకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *