సౌర విద్యుత్తు ఆధారంగా దేశంలో రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 2.7 లక్షల మెగావాట్ల(266 గిగావాట్లు) విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 293 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మోడీ అన్నారు. ఢిల్లీలో ఆదివారం మూడు రోజులపాటు జరగనున్న ఆర్‌ఈ-ఇన్వెస్ట్ సదస్సును మోడీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగంగా సౌర, పవన, జీవ్రదవ్య(బయోమాస్) విభాగాల ద్వారా వి ద్యుదుత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో విద్యుదుత్పత్తికి వీలుగా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. సుమారు 293 కంపెనీలు ఇంధన ఉత్పత్తికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. కొన్ని కంపెనీలైతే ఇందుకు అవసరమయ్యే పరికరాల తయారీకి కూడా ఒప్పుకున్నాయి. వెరసి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తకి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాన్నిసాధించేందుకు సహకరించనున్నట్లు తెలిపాయి. వీటికి మద్దతుగా అన్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ రూ. 75,000 కోట్లమేర రుణాలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది.
పవన విద్యుత్ రంగ దిగ్గజాలు సుజ్లాన్ ఎనర్జీ, గమేశా కంపెనీలు పరికరాల తయారీకి కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి. సంప్రదాయేతర ఇంధన విభాగంలో 11,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమయ్యే పరికరాలను అందించేందుకు సుజ్లాన్ ఆసక్తిని చూపగా, 7,500 మెగావాట్లకు సమానమైన పరికరాల తయారీకి గమేశా చొరవ ప్రదర్శించింది.
ఇలా కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేస్తే విద్యుత్తుకు విద్యుత్ ఉత్పాదన జరగడంతోపాటు లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.





