చిత్తూరు,ఏప్రిల్1: రాయలసీమకు నీరు రాకుండా వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గీర్వాణి ఆరోపించారు. ఢిల్లీ దాకా వెల్లి ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలను చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎడారిగా మారుతున్న రాయలసీమకు నీరు రావడం జగన్‌కు, వైకాపాకు ఇష్టం లేదన్నారు. పట్టిసీమను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీమ జిల్లాలు తాగు, సాగునీరు లేక విలవిలలాడిపోతున్నాయని, అందుకు పరిష్కారంగా ప్రభుత్వం గోదావరి మిగులు జలాలను కృష్ణానది ద్వారా రాయలసీమకు తెచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజల్లో టిడిపికి ఉన్న ఆదరణ రెట్టింపవుతుందనే ఆలోచనతో జగన్ కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఈడీ పెట్టిన కేసుల నుంచి బయటపడాలనే ఆలోచనతోనే జగన్ ప్రధాని మోదీని కలిసినట్లు చెప్పారు. సీమ రైతులకు మేలు చేసే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడటానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. నాడు ఎన్నో అవాంతరాలను అధిగమించి ఎన్టీ రామారావు తెలుగుగంగ పూర్తి చేసిన విధంగానే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమను పూర్తి చేసి సీమకు సాగునీరు అందిస్తారని అన్నారు. పట్టిసీమ పూర్తయితే రాయలసీమలో రెండు, మూడు పంటలు పండే అవకాశం ఉంటుందని చెప్పారు. జలవివాదాల పరిష్కారం, హక్కుల సాధన విషయంలో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలో అన్ని పక్షాలు ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా పనిచేస్తే అందుకు విరుద్దంగా జగన్ చర్యలు ఉన్నాయన్నారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి రెండు రోజులుగా జగన్ విన్నవించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వైకాపాకు ప్రజలు పట్టం కట్టలేదనే అక్కసుతో జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ పోలవరానికి ముందుగా ఉండే తాత్కాలిక పథకమేనని, దీన్ని చేపట్టి చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని చంద్రబాబు చెప్పినే విషయాన్నగి గుర్తుంచుకోవాలని గీర్వాణి అన్నారు.




