-రాజస్థాన్ నుంచి వేడిగాలులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్,మే2( జనం సాక్షి): భానుడు జనంనెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. సూర్యప్రతాపం రోజురోజుకూ విజృంభిస్తున్నది. వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మేనెల ప్రారంభంలోనే రాష్ట్రంలో వేసవి తీవ్రరూపం దాలుస్తున్నది. రాజధాని నగరమైన హైదరాబాద్‌పై సూర్య ప్రతాపం తగ్గడం లేదు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వాయువ్య భారతం నుంచి వేడి గాలులు వీస్తుండటంతో నగరంలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో మేఘాలు లేకపోవడంతో భానుడి కిరణాలు నేరుగా నేలవిూద పడుతున్నాయి. భూమిలోంచి వేడి సెగలు… వడగాలుల ప్రభావంతో నగరం నిప్పులకొలిమిని తలపిస్తోంది. వరుసగా పది రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య రికార్డవుతుండడంతో భూమి ఉష్ణోగ్రత పెరిగి, వేడి తీవ్రత మరింత అధికమవుతోందని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 45 డిగ్రీలుగా రికార్డయినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే నెల తొలిరోజు నుంచే సూర్యుడు మరింత భగ్గుమంటున్నాడు.. నగరాన్ని అగ్ని గోళంగా మార్చేశాడు. ప్రజలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం ఏడు గంటలకే ఎండ కాక మొదలవుతోంది. సాయంత్రం ఐదు దాటినా వేడి సెగలు తగ్గడం లేదు. పగటిపూట జనం ఇంట్లోంచి బయటకెళితే చమటతో తడిసి ముద్దవుతున్నారు. మంగళవారం ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత రికార్డైరది. గరిష్ఠం 42.5 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికం. కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు. దీంతో రాత్రిపూట ఉక్కపోత తప్పడం లేదు. ఫలితంగా విద్యుత్తు వినియోగం పెరిగింది. సోమవారం 59.35 మిలియన్ యూనిట్లను వినియోగించారు. జనం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కార్లలో ఏసీలు వేసుకుని వెళుతున్నా ఎండదెబ్బకు అవి ఏ మాత్రం చాలడం లేదు. అంతగా వాహనాలు వేడెక్కుతున్నాయి. వేడికి అద్దాలు పగిలే అవకాశం ఉందని… పార్కింగ్ చేసేటప్పుడు నీడ ఉన్నచోట చేయమని నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో గత పదేళ్లలో మే నెలలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఒక ఏడాది మినహా తొమ్మిదేళ్లు 42 డిగ్రీలపైనే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రాష్ట్రంలో వడగాలుల ముప్పు




