ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 7 (జనంసాక్షి) : రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోడీ నివాసంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ… దేశానికి అవసరమైన విధానాలు రూపొందించేలా వ్యవస్థ ఉండాలన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నూతన ప్రణాళికలు ఉండాలని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి కానిదే దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రణాళిక విధానంలో కింది నుంచి పైస్థాయి వరకు మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రణాళికా సంఘం స్థానంలో సుస్థిరమైన సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవశ్యకతను మోడీ ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శుల చేసిన సలహాలు, సూచనలను మోడీ పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ సీఎంలు ఈ సమావేశానికి హాజరుకాలేదు.





