గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రమంతా చెరువులకు వరద పోటెత్తుతోంది. చాలా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి బేసిన్లోని చెరువులు కళకళలాడుతున్నాయి. దాదాపు ఏడు వేల చెరువులు నిండుకుండల్లా మారియి. ఇందులో రెండువేలకు పైగా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా అలుగుపోస్తున్నాయి. బేసిన్లోని మొత్తం చెరువుల్లో 34 శాతం పూర్తిగా నిండాయి. మిగిలిన చెరువులకు కూడా ఇన్ఫ్లో భారీగా వస్తున్నది. మొత్తం 20,814 చెరువులకుగాను 5,848 …. 25 శాతం మేరకు నిండాయి. మరో 4,336 చెరువులు 25 నుంచి 50 శాతం… 3,532 చెరువులు 50 శాతం నుంచి 75 శాతం… 5,074 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం నిండాయి. 2,024 చెరువులు మత్తడి దుంకుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 వేల 427 చెరువులున్నాయి. అందులో 493 చెరువులు అలుగు పోస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 1940 చెరువులుంటే… 612 మత్తడి దుంకుతున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 2075 చెరువుల్లో 235 అలుగు పోస్తున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని సర్వాపురం-జగ్గన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న బొగ్గుల వాగు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో లోతట్టు గ్రామాలైన అంకన్నగూడెం, జగ్గన్నగూడెం, లాలాయిగూడెం, సర్వాపురానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆనకట్టలపై నుండి నీరు పొంగిపొర్లుతున్నది.




