– ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతాయి
– కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ
హైదరాబాద్, నవంబర్21(జనంసాక్షి): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి కాగల దమ్ము ఉందని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ చెప్పారు. ప్రధాన మంత్రి అవడానికి అవసరమైన అత్యుత్తమ శక్తి, సామర్థ్యాలు రాహుల్కు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలం పుంజుకుంటోందన్నారు. అదే సమయంలో ఎన్డీయే తన మిత్ర పక్షాలను కోల్పోతోందన్నారు.
తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన మొయిలీ విలేకర్లతో మాట్లాడారు. ప్రతిపాదిత బీజేపీయేతర కూటమి నేతగా రాహుల్ గాంధీని ప్రకటించే అవకాశం ఉందా? అని ప్రశ్నించినపుడు మొయిలీ స్పందిస్తూ ఆ ప్రశ్నకు తాను జవాబు ఇవ్వనక్కర్లేదన్నారు. చివరికి ప్రధాన మంత్రి పదవికి తగిన శక్తి, సామర్థ్యాలుగల నేతగా రాహుల్ గాంధీ అవతరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ మార్గదర్శి అని చంద్రబాబు అన్నారని, పరిస్థితులు ఆ విధంగా రూపుదిద్దుకుంటాయని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతాయని తెలిపారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రశంసించారు.




