Friday, 6 November 2026

రూ.1900 కోట్లతో నగరంలో ఇంటింటికి తాగునీరు

– రూ. 3100 కోట్లతో త్వరలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం
– దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుంది
– కేసీఆర్‌ను ఎవరు ఏవిూచేయలేరు
– రాష్ట్రంలోని పథకాలతో ఇతర రాష్ట్రాల మంత్రులు ఆశ్చర్యపోతున్నారు
– నగర వాసులు పరిశుభ్రతపై బాధ్యతగా మెలగాలి
– రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
– గ్రేటర్‌ హైదరాబాద్‌పై వరాల జల్లు కురిపించిన మంత్రి
– నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
హైదరాబాద్‌, మే22(జ‌నం సాక్షి ) : హైదరాబాద్‌ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం కేటీఆర్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అయ్యప్ప సొసైటీ వద్ద రూ. 6.8 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి ప్రారంభించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని డోయెన్స్‌ కాలనీలో రూ. 12.10 కోట్లతో 8.0 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ను, గోల్డెన్‌ తులిప్‌ వద్ద రూ. 4.68 కోట్లతో 3 మిలియన్‌ లీటర్ల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్‌ను, హైదర్‌నగర్‌లో 3.5 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం ఉన్న జలాశయం, హుడా పార్క్‌ వద్ద 14 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం ఉన్న మంచి నీటి రిజర్వాయర్లను  మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. వరాల జల్లు కురిపించారు. ‘1900 కోట్ల రూపాయలతో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 డివిజన్ల్‌లో ఇంటింటికి మంచినీరు అందిస్తామని తెలిపారు.  ఎండాకాలంలో కరెంటు, నీటి సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.  హైదరాబాద్‌ కోటి జనాభాతో 9 వేల కిలో విూటర్ల మహా నగరం ఉందని, రోడ్ల పునరుద్దరణ వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. నగర నీటి అవసరాల కోసం శివారులో 56 రిజర్వాయర్లు ఏర్పాటు చేశామని కేటీఆర్‌ అన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుందని, తాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా నగరంలో పలు చోట్ల నిర్మించిన మంచినీటి రిజర్వాయర్లను నేడు ప్రారంభించినట్లు తెలిపారు. నగరంలో 3100 కోట్లతో త్వరలో అండర్‌  గ్రౌండ్‌ డ్రైనేజ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.  హైదరాబాద్‌
రోడ్ల అభివృద్ధికి కార్పోరేషన్‌ ద్వారా రోడ్లను బాగు చేస్తున్నామని, ఒఆర్‌ఆర్‌ చుట్టూ మంచినీరు అందించేందుకు రింగ్‌ మాన్‌ను ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ తెలిపారు.  హైదరాబాద్‌ మంచి నీరు అవసరాల కోసం కేశవాపురం రిజర్వాయర్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. కేసీఆర్‌ ను ఎవ్వరూ  ఏమి చేయలేరని, రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ పాలన చూసి ఇతర రాష్ట్రాల మంత్రులు పరిశీలనకు వస్తున్నారని, ఇక్కడ పథకాలను చూసి ఆశ్చర్య పోతున్నారని అన్నారు. వాటిని తమ రాష్ట్రాల్లో అమలు చేసుకుంటున్నారని కేటీఆర్‌ తెలిపారు. నగరంలో పార్కులను అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 చెరువుల్లో 550 కోట్లతో 40 చెరువులు అభివృద్ధి చేస్తున్నాని, అపార్ట్‌మెంట్స్‌ వాళ్లు సీవరెజ్‌ ట్రేట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. నాలాల్లో అందరూ చెత్త వేస్తున్నారని, నగర వాసులు పరిశుభ్రతపై భాద్యతతో మెలగాలని కేటీఆర్‌ కోరారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
—————————