– మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తిచూపిన ప్రయాణికులు
– తొలిరోజు రికార్డులన్నీ బ్రేక్
– మెట్రో స్టేషన్ల వద్ద తప్పని పార్కింగ్ కష్టాలు
– మెట్రోలో వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు కలిగించకండి
– ప్రయాణికులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్30(జనంసాక్షి) : హైదరాబాద్ నగరవాసులు మెట్రోవైపు పరుగులు తీస్తున్నారు.. మెట్రో సౌకర్యం అందుబాటులోకి వచ్చిన రెండువ రోజు గురువారంకూడా భారీ సంఖ్యలో నగరవాసులు మెట్రో ప్రయాణించేందుకు మెట్రో స్టేషన్ల వద్ద బారులు తీరారు. బుధవారం ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ చేతులువిూదుగా మెట్రోను ప్రారంభించారు. గురువారం మెట్రోను నగరవాసులకు తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటిరోజు భారీ సంఖ్యలో నగరవాసులు మెట్రోలో ప్రయాణించగా.. రెండవ రోజు గురువారం సైతం మెట్రో ఎక్కేందుకు అదే ఉత్సకతను చూపించారు. ఇదిలా ఉంటే
మెట్రోరైలు తొలిరోజే రికార్డు సృష్టించింది. దేశంలోని మిగతా మెట్రోలతో పోల్చితే మొదటిరోజే దాదాపు లక్ష మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. మొదట ప్రారంభమైన కోల్‌కతా మెట్రో మొదలుకొని.. ఈ ఏడాది ప్రారంభమైన కొచ్చి, లక్నో మెట్రోల వరకు ఏవీ మన రికార్డుకు చేరువలో కూడా లేవు. ఇప్పటివరకు తొమ్మిది మెట్రోలు ప్రారంభం కాగా.. ఎక్కడా తొలిరోజు ప్రయాణికుల సంఖ్య 50 వేలు కూడా దాటలేదు. మన మెట్రోలో మాత్రం లక్ష మంది ప్రయాణించారు. తొలిరోజు వసూళ్లలోనూ మన మెట్రో రికార్డు బ్రేక్ చేస్తుందని అధికారులు చెప్తున్నారు.
మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ కష్టాలు..
ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తుందని భావించిన మెట్రో రైలు నగరవాసులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. చాలా స్టేషన్లలో పార్కింగ్ వసతి లేకపోవడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. స్టేషన్ కింది భాగంలో వాహనాలను అస్తవ్యస్తంగా పార్క్ చేస్తుండటంతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. అవిూర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ వద్ద గురువారం వాహనాలను ఇష్టమొచ్చినట్టుగా పార్క్ చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను అక్కడి నుంచి తరలించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అవిూర్‌పేట స్టేషన్లో పార్కింగ్ వసతి కల్పించకపోవడం పట్ల జనం మండిపడుతున్నారు. చాలీస్ కమాన్ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తామని నిర్ణయించినా, ఇంకా అమల్లోకి రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మెట్రో సిబ్బంది చెబుతున్నారు. చాలా స్టేషన్లలో వాహనాలు నిలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సివస్తోంది. పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేదు. నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక స్టేషన్లలో ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండగా.. కార్లు, బస్సులు, క్యాబ్స్ నిలిపేందుకు స్థలం లేదు. కొన్ని స్టేషన్లలో నిర్మాణ పనులు ఇంకా జరుగుతుండటంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. దీనిపై స్పందించిన హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. పార్కింగ్ చార్జీలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మెట్రోరైలు ప్రయాణ చార్జీలు ఎక్కువేవిూ లేవని ఆయన చెప్పారు.
నగరవాసులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమైన తొలిరోజు రికార్డు స్థాయిలో ప్రయాణింకులు ప్రయాణించారు.. కాగా రెండో రోజు ప్రయాణికుల రద్దీని గమనించిన మంత్రి కేటీఆర్ మెట్రో స్టేషన్ల వద్ద రద్దీని నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. రద్దీని నియంత్రించాలని కోరుతూ నగర పోలీసులు, మెట్రో, ఎల్అండ్టీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా హైదరాబాద్‌వాసులకు కూడా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇది మన మెట్రో. మనకు గర్వకారణం. చిన్నారులు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా చూడాలని మెట్రో ప్రయాణికులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
రెండోరోజూ ‘మెట్రో’ రద్దీ




