Wednesday, 4 November 2026

రెడ్డీలతో నాకూ అన్యాయం జరిగింది

– అలా అని పార్టీని వీడటమే పరిష్కారం కాదు
– పార్టీ వేదికపైనే బలంగా ఫైట్‌ చేయాలి
– పంచాయతీ ఎన్నికల్లో 54శాతం సీట్లను బీసీలకే ఇవ్వాలి
– ఇచ్చినమాటలను కేసీఆర్‌ నిలబెట్టుకోవాలి
– విలేకరుల సమావేశంలో వి.హెచ్‌ హన్మంతరావు
హైదరాబాద్‌, జూన్‌23(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పార్టీలో రెడ్డీలతో నాకు కూడా అన్యాయం జరిగిందని, కానీ పార్టీ వదిలిపెట్టలేదని, సమస్యకు అది పరిష్కారం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు..  దానం నాగేందర్‌ పార్టీని వీడడంపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పడి నుంచే రెడ్డీలు ఉన్నారన్నారు. సుదీర్ఘకాలం తాను పార్టీలో కొనసాగుతున్నానని రెడ్డీల వల్ల తనకు కొన్ని పదవులు దూరమయ్యాయన్న మాట వాస్తవమన్నారు. అలా అని పార్టీని వీడితే సమస్య పరిష్కారం కాదని తెలిపారు. బీసీలకు అన్యాయం జరిగితే పార్టీ వేదికపై చర్చించాలని, పార్టీలో ఉండి ఫైట్‌ చేయాలని.. అవసరమైతే ఢిల్లీ వెళ్లి అధిష్టానంకు తమ సమస్యలను ఒకటికి పదిసార్లు వినిపించి మనం అనుకున్నది సాధించాలన్నారు. ఆ స్వేచ్చ కాంగ్రెస్‌ పార్టీలో ఉందని విహెచ్‌ తెలిపారు. అలాకాకుండా బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్‌లో బీసీలకు ప్రాధాన్యత లేదంటూ పార్టీని వీడడం సరైందికాదన్నారు.  తాను మాత్రం కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, 2019లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో 54 శాతం సీట్లను బీసీలకే ఇవ్వాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పిస్తామని సీఎం మాట ఇచ్చారని, దానిని అమలు చేసి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు హనుమంతరావు డిమాండ్‌ చేశారు. అలా లేనిపక్షంలో ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమని హెచ్చరించారు.