రేవంత్‌రెడ్డి చిల్లరగాడు
– తప్పుడు వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు
– రూ.5లక్షలనబోయి పొరపాటున రూ.10కోట్లు కేసీఆర్ ఇస్తారన్నా
– గత ఎన్నికల్లో విషయాన్ని.. ఈ ఎన్నికల్లో ముడిపెడుతున్నారు
– రేవంత్ ప్రోత్సహిస్తే కాంగ్రెస్ పతనం ఖాయం
– కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే కూటమి కడుతున్నారు
– ఎన్ని కూటములతో వచ్చినా టీఆర్‌ఎస్‌కు 100సీట్లు ఖాయం
– ఆపద్ధర్మ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్13(జనంసాక్షి) : రేవంత్‌రెడ్డి ఓ చిల్లరగాడని, అసత్య వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం తెరాస భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రేవంత్ రెడ్డి చిల్లరగాడని, ఈసారి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. తాను ముషీరాబాద్ ప్రెస్‌విూట్‌లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున గత ఎన్నికల సందర్భంగా రూ.5, 10 లక్షలో కేసీఆర్ ఇస్తారన్నారనే బదులు రూ.10 కోట్లు అన్నానని వివరణ ఇచ్చారు. గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని చెబితే ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే అది కాంగ్రెస్‌కే నష్టమని నాయిని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేసింది.. ప్రజలు తప్పక ఆ పార్టీని శిక్షిస్తారని నాయిని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే కూటమి కట్టిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదని నాయిని తేల్చిచెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. అడ్వకేట్ ఫిర్యాదుతోనే రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయన్నారు. ఆ దాడులకు, టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అబద్దాలతో కొడంగల్ ప్రజలను రేవంత్‌రెడ్డి మోసం చేశాడని, కొడంగల్‌లో రేవంత్ అడ్రస్ లేకుండా పోతాడని నాయిని జోస్యం చెప్పాడు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు రావడం ఖాయమని నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదని పలు విూడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, అది సరికాదన్నారు. అసత్య వార్తలు ప్రచారం చేయడం సరికాదనని సూచించారు.