Friday, 6 November 2026

రైతుబంధుకు గుర్తింపు అద్భుత విజయం

కెసిఆర్‌ సర్కార్‌ సాధించిన విజయమన్న పోచారం

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి గుర్తించడం పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన స్పందనను తెలియజేశారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి ధన్యవాదాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం అని మరోసారి నిరూపణ అయిందన్నారు. రైతులు అప్పుల ఊబినుండి బయటపడి తలెత్తుకోని తిరగాలన్నదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ద్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెటును 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చూశామన్నారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక వెన్నుదన్ను అందజేస్తున్నట్లు చెప్పారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం బారీగా గోదాములు నిర్మించాం. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమాతో దీమా కల్పిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందన్నారు. తమ వెనుక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చింది. తమ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.