– ఎన్నికల కోసమే కేసీఆర్ కొత్త నాటకం
– రాష్ట్రంలో సమస్యలను పక్కదారిపట్టించేందుకే తెరపైకి ఓటుకునోటు కేసు
– కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు
హైదరాబాద్, మే8(జనం సాక్షి) : ఎన్నికలు దగ్గరపడుతున్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రైతుబంధు’ అనే కొత్త నాటకం మొదలుపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే నిలదీయాలని, ధర్నా చేయాలని చెప్పిన కేసీఆర్…. ధర్నా చేస్తున్న రైతులకు మాత్రం సంకెళ్లు వేయించారని అరోపించారు. రాష్ట్రంలో మూడు వేలకు పైగా రైతులు చనిపోతే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేదని విమర్శించారు. రైతు బంధు కార్యక్రమానికి వచ్చే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రావొద్దంటూ లేఖలు రాస్తానని చెప్పారు. ‘రైతుబంధు అంటే రైతుకు సంకెళ్లు వేయడమా’ అంటూ రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరించే గోడపత్రికలను వీహెచ్ విడుదల చేశారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా అంటించి రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని వీహెచ్ చెప్పారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని విహెచ్ విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ దొరల పాలనను సాగిస్తున్నాడని వి.హెచ్. మండిపడ్డాడు. రైతులకు పెట్టుబడి పథకాన్ని కౌలు రైతులకు పంపిణీ జరపాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అకాల వర్షంతో పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని పరామర్శించి నష్టపరిహారం అందేలా చూడాల్సి కేసీఆర్, తెరాస నేతలు ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రంలోని రైతులకు న్యాయం చేయలేని కేసీఆర్ దేశంలోని రైతులకు ఏం చేస్తారంటూ వి.హెచ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైన కేసీఆర్ తీరు మార్చుకొని నిజాయితీగా పాలన సాగించాలని, లేకుంటే 2019లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
రైతులకు సంకెళ్లు వేసిన కేసీఆర్ రైతుబంధువా?




