కేసీఆర్ ఆశయం
– భూమిని నమ్ముకున్నవారు ఎప్పుడూ చెడిపోలేదు
– శాస్త్రవేత్తల మేధాశక్తి రైతుశ్రమ తోడైతే అద్భుత ఫలితాలు వస్తాయి
– ఖరీఫ్‌కు 7.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు
– 8లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచాం
– త్వరలో రైతుబీమా పథకం
– రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, మే24(జనం సాక్షి) : తెలంగాణలో రైతులు ఆత్మాభిమానంతో బతకాలన్నదే కేసీఆర్ ఆశయమని, ఆమేరకు కేసీఆర్ ప్రత్యేక ప్రణాలికతో ముందుకు సాగుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మంత్రి ‘విత్తన మేళా 2018’ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూమిని అమ్ముకున్నవాళ్లు చెడిపోయారు కాని.. భూమిని నమ్ముకున్నవాళ్లు ఎప్పుడూ చెడిపోలేదని అన్నారు. ఆరోగ్యకరమైన విత్తనం నాటితేనే పంట దిగుబడి బాగుంటుందన్నారు. ప్రధానమంత్రి మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటున్నారు కాని.. అది ఎలా అనేది మాత్రం ఆయన చెప్పట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ముందుకెళ్లారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మాభిమానంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ప్రపంచంలో మొదటి సారి ఎకరాకు రూ. 8000 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పోచారం స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యాపారుల దగ్గర అప్పు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తున్నదన్నారు. శాస్త్రవేత్తల మేధాశక్తికి రైతుల శ్రమ తోడయితే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వం రాయితీలతో పాటు మౌలిక సదుపాయలను కల్పిస్తున్నదన్న పోచారం.. మూల విత్తనంపై 50 శాతం సబ్సిడీని అందజేస్తామన్నారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లు, తొక్కిసలాట, లాఠీచార్జీలు జరిగేవని.. కేసీఆర్ ముందు చూపుతో ప్రస్తుతం విత్తనాలు, ఎరువుల కొరత లేదన్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలం కోసం 7.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 8 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో 3600 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మక్కలను రూ. 1100 కే కొనుగోలు చేస్తున్నారు కాని.. మన రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర అందించాలని రూ.1420కు కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు లాభం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి నష్టం అయినా రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పంటల బీమాకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, రైతు బీమా సౌకర్యంపై విధివిధానాలను రూపొందించి త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే వారం రోజుల్లోనే కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. దీనిపై సీఎం ఇన్సురెన్స్ కంపెనీలతో సమావేశమై విధివిధానాలను రూపొందిస్తారని మంత్రి స్పష్టం చేశారు. రైతును అన్ని విధాల ఆదుకొనేందు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని, రాబోయే కాలంలో దేశానికి తెలంగాణ రైతు ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రైతు ఆత్మాభిమానంతో బతకాలన్నదే




