రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు: కిలో ఉల్లి రూ.20కే
ఉల్లిగడ్డ ధర ఆకాశాన్నంటడంతో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ధర భారాన్ని వినియోగదారులపై పడకుండా సబ్సిడీ ధరకే ఉల్లిగడ్డలను కిలో 20 రూపా యల చొప్పున రైతు బజార్ల ద్వారా అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ డివిజన్లలో కూడా ఈ సబ్సిడీ ఉల్లిగడ్డలను అందుబాటులోకి తేవాలన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావుతో పాటు మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు జూపల్లి కృష్టారావు, లక్ష్మారెడ్డి లు పాల్గొన్నారు. ఈ నెల ఐదు నుండి రూ.20 రూపాయలకే కిలో ఉల్లిగడ్డలను సరఫరా చేయాలని హరీష్ రావు అధికారులకు సూచించారు. మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ధరను జిల్లాల్లో పకడ్బందీగా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవా లన్నారు. ప్రతి కుటుంబానికి రెండు కిలోల చొప్పున పంపిణీ చేయాలన్నారు. ఉల్లిగడ్డల కొనుగోలు కోసం ఇప్పటికే మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులకు తెలిపారు నాసిక్, మలక్‌పేట్, కర్నూల్ జిల్లాల వారితో సంప్రదింపులు జరిపి ఉల్లిగడ్డలను కొనుగోలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోవడంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు చొరవ తీసుకోవాలని అన్నారు. ఉల్లిగడ్డలను కొనేటప్పుడు కచ్చితంగా నాణ్యతను పరిశీలించాలని అన్నారు.