నాలుగు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ పునః ప్రారంభమైంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై సభలో సుదీర్ఘ చర్చ జరుగుతుంది. వర్షాభావంతో వ్యవసాయ రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యామ్నాయ విధానాలు, రైతుల సంక్షేమంపై చర్చ జరుగుతుంది. ఇతర అంశాలకంటే ముందుగా రైతుల సమస్యలపై సమగ్రచర్చ జరగాలని పాలకపక్షం టీఆర్ఎస్ ఈ నెల 23న జరిగిన బీఏసీ సమావేశంలో ప్రతిపాదించింది. టీఆర్ఎస్ ప్రతిపాదనను అన్ని పార్టీలు బలపరిచాయి. ఈ నేపథ్యంలో రుతుపవనాల వైఫల్యం, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ ప్రారంభమైంది.
మొదటిసారి వాయిదా తీర్మానాలు, క్వశ్చన్ అవర్ లేకుండా అసెంబ్లీలో నేరుగా రైతు సమస్యలపై చర్చ జరగనున్నది. సీఎం కేసీఆర్ ప్రసంగంతో ఈ అంశంపై షార్ట్ డిస్కషన్ ప్రారంభమవుతుంది. సభ ప్రారంభంలోనే సీఎం కేసీఆర్ వర్షాభావం, రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ పెంపు, తదితర అంశాలపై మాట్లాడుతారని సమాచారం. అనంతరం ప్రతిపక్ష నాయకులకు అవకాశమిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు చర్చ పూర్తికాకపోతే.. సాయంత్రం వరకు సభను పొడిగించే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు కోరితే రేపు కూడా శాసనసభలో రైతుల సమస్యలపై చర్చ కొనసాగుతుంది.
వాయిస్: వర్షాభావంపై ఓ అంచనాకొచ్చి, కేంద్రానికి కరువు ప్రాంతాల నివేదిక పంపాలంటే సీజన్ పూర్తి కావాలి. అందుకోసం అక్టోబర్ చివరి దాకా ఆగాలి. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కసరత్తంతా చేస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాలు, మండలాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. వర్షాభావ పరిస్థితులపై ఆరా తీసింది. నిజానికి ఈ సారి వర్షపాతం లోటు ఎక్కువగా ఉంది. చాలా జిల్లాల్లో సాధారణం కంటే 14 శాతం తక్కువ రెయిన్ ఫాల్ రికార్డయింది. నిజామాబాద్ జిల్లాలో అయితే సాధారణం కన్నా 44 శాతం లోటు నమోదైంది. మెదక్ 34 శాతం, మహబూబ్ నగర్ 24 శాతం, రంగారెడ్డి జిల్లాలో 26 శాతం వర్షపాతం లోటుంది. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 206 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంటల సాగు విస్తీర్ణమూ బాగా తగ్గింది. లెక్క ప్రకారం ఈ సీజన్ లో రాష్ట్రమంతా 41 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంది. కానీ 35 లక్షల హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. ఇది సాధారణం కన్నా 15 నుంచి 16 శాతం తక్కువ!
వాయిస్: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. అధకారంలోకి రాగానే గత ప్రభుత్వాలు రుద్ది వెళ్లిన 480 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు విడుదల చేసింది. ఈమధ్యే ఇంకో 46 కోట్లు ఇచ్చింది. నేడో రేపు మరో 112 కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవికాక రైతుల్ని ఆదుకోవడానికి మరెన్నో చర్యలు తీసుకుంది. సబ్సిడీ విత్తనాల సరఫరా, విత్తన పరిశ్రమకు ప్రోత్సాహం, లక్షలాది టన్నుల ఎరువుల పంపిణీ, రైతు సదస్సుల ద్వారా శిక్షణ, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం, వ్యవసాయ యాంత్రీకరణ, విరివిగా పంట రుణాలు, పావలా వడ్డీకే రుణాలు, మన తెలంగాణ-మన వ్యవసాయం పేరుతో రైతులకు అవగాహనా సదస్సులు వంటి కార్యక్రమాలు చేపడుతోంది. హార్టికల్చర్ కింద పాలీహౌస్ ల ఏర్పాటుకు 250 కోట్లు కేటాయించింది. 308 కోట్లు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహించింది. రాష్ట్రంలో ఉల్లి సాగు పెంచడానికీ నిర్ణయం తీసుకుంది. మొన్నటి కేబినెట్ సమావేశంలో అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆత్మహత్యల్ని నివారించడానికి అన్నదాతల్లో మనోధైర్యం నింపే కార్యక్రమాన్ని తలపెట్టింది. రైతన్నకు వీలైనంతగా చేయూతనివ్వడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నది. వీటన్నింటినీ ప్రభుత్వం అసెంబ్లీకి వివరించనుంది. రైతు ఆత్మహత్యలపై చిలువలు పలువలు చేస్తున్న విపక్షాలకు గట్టిగా సమాధానం చెప్పనుంది.




