రైల్వేజోన్ సాధనకు అంతిమ పోరాటం
– ప్రత్యేక రైల్వేజోన్ సాధన సమితి కన్వీనర్ జె.వి. సత్యనారాయణమూర్తి
విశాఖపట్నం, ఆగస్టు17(జనం సాక్షి ) : విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధించేందుకు అంతిమ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ‘ప్రత్యేక రైల్వేజోన్ సాధన సమితి’ కన్వీనర్ జె.వి.సత్యనారాయణ మూర్తి ఇవాళ విశాఖలో తెలిపారు. శుక్రవారం విశాఖపట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరున రైల్వేజోన్ సాధన సమితి ప్రతినిధులు ఆఖరి ప్రయత్నంగా ఢిల్లీ పెద్దలను కలిసి రైల్వేజోన్ కోసం చర్చించనున్నట్లు సత్యనారాయణ మూర్తి చెప్పారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే సెప్టెంబరులో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడికక్కడ రైల్వే మార్గాలను ఆపేసి రైల్‌రోకో చేస్తామని హెచ్చరించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత రైల్వేజోన్ సాధన సమితి ప్రతినిధులంతా సమావేశమై తమ అంతిమ పోరాటానికి తేదీలు నిర్ణయిస్తామని వెల్లడించారు. అప్పటికీ స్పందించకపోతే తదుపరి జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.