రైల్వే రిజర్వేషన్‌కు తాత్కాలిక అంతరాయం


హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్‌ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టంలో డిజాస్టర్‌ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. దీంతో చార్టింగ్‌, కరెంట్‌ బుకింగ్‌, పీఆర్‌ఎస్‌ ఎంక్వైరీ, టికెట్‌ రద్దు, చార్జీలు రీఫండ్‌ తదితర పీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచి పోనున్నాయి. శనివారం రాత్రి 11.45 నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు.. తిరిగి 22న రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని అధికారులు పేర్కొన్నారు. ఆయా సమయాల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్‌ చార్టులు, కరెంట్‌ బుకింగ్‌ చార్టులు ముందుగానే సిద్ధం చేయనున్నట్లు వివరించారు.