రోడ్డుపై శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలి : సీపీఐ (ఎం)

చేర్యాల (జనంసాక్షి) జూన్ 30 : కడవేర్గు-పెద్దరాజుపేట మధ్యలో రోడ్డుకు శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని గురువారం సీపీఐ (ఎం) నాయకులు మత్తడి వద్ద ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా పార్టీ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. కొద్దిపాటి వర్షానికే మత్తడి నీరు రోడ్డుపై ప్రవహించడంతో పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రజలు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈప్రాంతం మీదుగా వందలాది మంది నిత్యం ప్రయాణం చేస్తుంటారని, నిర్మాణానికి 1 కోటి 60 లక్షలు మంజూరు కాగా అందులో తాత్కాలికంగా 8లక్షల నిధులతో మాత్రమే నిర్మిస్తామనడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా తాత్కాలిక పనులు కాకుండా శాశ్వతంగా నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పొనుగంటి శ్రీనివాస్ రెడ్డి, సత్తయ్య, లక్ష్మి, కనకచారి తదితరులు పాల్గొన్నారు.