Tuesday, 3 November 2026

రోహిత్‌ ఆత్మహత్మపై దేశవ్యాప్తంగా ఆందోళనలు

C
– పలు రాష్ట్రాలతో సహా జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా

– దత్తాత్రేయ ఇంటిముందు ఆందోళన

హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెంట్రల్‌ యూనివర్సీటీకి చెందిన దళిత విద్యార్థి ఆత్మహత్యపై దేశవ్యాప్తంగ భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీంతో ఇంకా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మంగళవారం వీసీ కార్యాలయం వద్ద హెచ్‌సీయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావును తప్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు హెచ్‌యూసీ వీసీ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని  జేఏసీ ప్రకటించింది. మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్‌ అనే పీహెచ్‌డీ విద్యార్థి కలత చెంది ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  వీసీ రాజీనామా చేసే వరకు క్లాసులు బహిష్కరిస్తామని… కార్యకలాపాలు కొనసాగనివ్వమని నాయకులు తెలిపారు.  రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై ద్విసభ్య కమిటీ విచారణ జరుపుతుంది. వర్సిటీ అధికారులను, విద్యార్థులను కమిటీ విచారిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలను గుండాలతో.. వర్సిటీ వీసీని క్రిమినల్‌గా చిత్రీకరిస్తూ విద్యార్థులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

దత్తాత్రేయ ఇంటి వద్ద జాగృతి కార్యకర్తల ఆందోళన

సెంట్రల్‌ వర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై హైదరాబాద్‌ రాంనగర్‌లోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద తెలంగాణ జాగృతికార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.  ఆయన రాసిన లేఖ వల్లే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ఐదుగురు దళిత విద్యార్దులు సస్పెన్షన్‌ కు గురయ్యారని ఆరోపిస్తూ,దాని పరిణామ క్రమంలోనే రోహిత్‌ ఆత్మహత్య జరిగిందని విద్యార్దులు ఆరోపిస్తున్నారు.  జాగృతి అదినేత, నిజామాబాద్‌ ఎమ్‌.పి కవిత ఇప్పటికే దళిత విద్యార్దులకు సంఘీ భావం ప్రకటించిన నేపధ్యంలో ఆ సంస్థ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌ ఎన్నికల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. బండారు దత్తాత్రేయ వెంటన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి డిమాండ్‌ చేసింది. ఉదయం  దత్తాత్రేయ ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణ జాగృతి యువజన విభాగం యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జాగృతి నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

రోహిత్‌ కుటుంబ సభ్యులకు జగన్‌ పరామర్శ

పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ కుటుంబ సభ్యులకు వైకాపా అధ్యక్షుడు జగన్‌ మంగళవారం ఫోన్‌ చేసి పరామర్శించారు. యూనివర్సిటీలో జరిగిన ఘటనలపైగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసిన జగన్‌.. యూనివర్సిటీలో జరిగిన పరిణామాల గురించి రోహిత్‌ తల్లిని అడిగి తెలుసుకున్నారు. రోహిత్‌ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా వుండగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య అంశం రాష్ట్రానికి చెందిన వ్యవహారమని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. రోహిత్‌ ఆత్మహత్యపై మంగళవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. విద్యార్థి ఆత్మహత్యపై ద్విసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే తాను ఈ అంశంపై స్పందిస్తానని చెప్పారు. అప్పటి వరకు తాను ఈ అంశంపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని  స్మృతీ ఇరానీ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కమిటీ వేశామని అన్నారు.

రోహిత్‌ ఆత్మహత్యపై హెచ్చర్సీలో ఫిర్యాదు

హెచ్‌సీయూ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్‌ చేశారు. ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఫిబ్రవరి 1 లోగా నివేదిక సమర్పించాలని సైబరాబాద్‌ సీపీ, హెచ్‌సీయూ వీసీకి ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *