రaూటా నిర్భర్‌ భారత్‌


` అబద్ధాల పునాదులపై మోదీ పాలన
` రఫేల్‌ కుంభకోణం బట్టబయలు చేస్తాం
` సుప్రీం కోర్టులో పోరాడుతాం
` బీజేపీ అవినీతిపై దిల్లీలో పంచాయితీ పెడతా..
` అవసరమైతే కొత్తపార్టీ పెడతా
` దళితుల కోసమే కొత్తరాజ్యాంగం కావాలన్నాను
` జనం ఉప్పెనలా కదిలితేనే కొత్తమార్పు
` నేను ఉచిత విద్యుత్‌ ఇచ్చుకుంటే మోదీకేంటి ఇబ్బంది!
` బీజేపీ అధ్యక్షుడిని చూస్తే జాలేస్తుంది.. ఆయనకు సదువు వస్తదో రాదో పాపం
` ప్రధాని చెప్పేదొకటి.. చేసేది మరొకటి
` యూపీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు పెంచుతారు
` కర్ణాటకలోని విద్వేషం అంతటా వస్తే దేశం పరిస్థితేంది?
` ధర్మంపేరిట అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తారా?
` ప్రగతిభవన్‌లో కేంద్రం నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి):ఆత్మనిర్భర్‌ భారత్‌’ను ‘రaూటా నిర్భర్‌భారత్‌’గా సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు.ప్రధాని నరేంద్ర మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘విద్యుత్‌ సంస్కరణలు తెస్తున్నారు.. అందులో భాగంగా ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాలకు పంపించారు. ఆ బిల్లుపై ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను కూడా చెప్పారు. బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. విద్యుత్‌ సంస్కరణలు వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. సంస్కరణలు అమలు చేస్తే అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఐదేళ్ల పాటు ఇస్తామన్నారు. విద్యుత్‌ సంస్కరణలకు అదనపు రుణాలు తీసుకుంటున్నారు. అదనపు రుణాల విషయమై కేంద్ర బడ్జెట్‌లో కూడా చెప్పారు. కేంద్ర ముసాయిదా బిల్లుకు ఏపీ అంగీకరించింది. శ్రీకాకుళం జిల్లాలో 25వేల వ్యవసాయ మోటార్లకు విూటర్లు కూడా పెట్టారు. మిగతా విద్యుత్‌ విూటర్లకు రూ.737 కోట్లతో టెండర్లు పిలిచారు. కేంద్రం చెప్పినట్టు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయే అవకాశముంది. అయినా సరే, మోటార్లకు విూటర్లు పెట్టబోమని స్పష్టంగా చెప్పాం. చరిత్రను కప్పిపుచ్చి భాజపా నేతలు గోల్‌మాల్‌ చేస్తున్నారు. బహిరంగ సభల్లో అన్ని విషయాలు చెప్పలేం. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయమని కేంద్రం చెప్పినట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతానని బండి సంజయ్‌ అన్నారు. ఇవిగో.. ఆధారాలు. బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి. సాగుకోసం కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్ర విధానం. వందశాతం విూటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఏడాదిలోగా విద్యుత్‌విూటర్లు పెట్టాలన్నారు’’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు.‘‘విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయట్లేదని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తే లాండ్రీలకు, వస్త్ర పరిశ్రమకు, పౌల్ట్రీలకు, వ్యవసాయానికి, ఎస్సీలకు ఉచిత విద్యుత్‌ సరఫరా నిలిపివేయాల్సి ఉంటుంది. మిషన్‌ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని పిలిస్తే బహిరంగ సభలో పచ్చి అబద్దాలు చెప్పారు. యూనిట్‌కు రూ.11 చొప్పున కొని రూ.1.10కే రాష్ట్రాలకు ఇచ్చినట్టు చెప్పారు. కేంద్రం ఎన్నూడూ రూ.1.10కు ఏ రాష్ట్రానికి విద్యుత్‌ ఇవ్వలేదు. కేంద్రం అబద్దాలపై చర్చకు రావాలన్నా భాజపా నేతలు ముందుకు రారు. దేశంలో 4లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదు. విద్యుత్‌ లేక దేశంలో 60శాతం అంధకారంలో ఉంటోంది. తెలంగాణలో తప్ప 24 గంటల విద్యుత్‌ ఏ రాష్ట్రం ఇవ్వటం లేదు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించాలనేది కేంద్రం ఉద్దేశం. విద్యుత్‌ సంస్థలు నిర్మించినా ఉత్పత్తి కానివ్వట్లేదు. పార్టీలకు చందాలు ఇచ్చే వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. చందాలు ఇచ్చే సంస్థల సోలార్‌ విద్యుత్‌ కొనాలంటున్నారు. కృష్ణానదిపై ఆధారపడి రాష్ట్రంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి ఎక్కువ. క్లీన్‌ ఎనర్జీ కింద సోలార్‌ విద్యుత్‌ కొనాలంటున్నారు. సాగర్‌, శ్రీశైలం విద్యుత్‌ ఆపైనా సౌర విద్యుత్‌ కొనాలని అంటున్నారు. సౌర విద్యుత్‌ కొనకపోతే జరిమానా విధిస్తామంటున్నారు’’‘‘33 మంది దేశంలోని వివిధ బ్యాంకులను ముంచి లండన్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. వారిలో చాలా మంది మోదీ గారి దోస్తులే. ఎక్కువ మంది గుజరాత్‌కు చెందిన వారే. అందుకే భాజపాను దేశం నుంచి తరిమికొట్టాలని చెబుతున్నాం. వీళ్లని తరిమికొట్టకపోతే దేశం నాశనమైపోతుంది. రఫేల్‌ జెట్‌ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగింది. వేల కోట్లు మింగారు. మనకంటే చౌకగా ఇండోనేషియా రఫేల్‌ విమానాలు కొన్నది. భాజపా అవినీతి గురించి దిల్లీలో పంచాయితీ పెడతా. భాజపా నేతలకు దమ్ముంటే వీటిపై మాట్లాడాలి. మేం మిమ్మల్ని జైలుకు పంపేది పక్కా. భాజపా పాలకుల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. బడ్జెట్‌ను నేను సరిగా అర్థం చేసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. రూ.34,900 కోట్ల ఎరువుల సబ్సిడి తగ్గించింది అబద్దమా?. ఉపాధి హావిూ పథకానికి రూ.25వేల కోట్ల తగ్గింపు నిజం కాదా?. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన విషయం వాస్తవం కాదా?’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.‘భాజపా తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసింది. ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ భాజపా. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌లో గెలవకపోయినా పాలిస్తున్నారు. మహారాష్ట్రలో పాలిద్దామని యత్నించి బోల్తా పడ్డారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత పెట్రోల్‌ రేట్లు పెంచుతారు. మోదీ ట్రంప్‌ తరఫున ప్రచారం చేశారు. భారత ప్రధాని అమెరికా ఎన్నికల్లో ప్రచారం చేయడం ఏంటి? అమెరికా ఎన్నికలు .. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలా? అమెరికా ఎన్నికల కోసం మోదీ ప్రచారం వ్యూహాత్మక తప్పిదం. భాజపా విద్వేష రాజకీయాల గురించి యువత ఆలోచించాలి. శాంతిలేని చోట ఎవరు పెట్టుబడులు పెడతారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగుల్చుతున్నారు? శాంతిభద్రతలు కోరుకుందామా?.. ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? రాహుల్‌గాంధీ పట్ల అస్సాం సీఎం వ్యాఖ్యలు సమంజసమేనా? భాజపా అగ్రనేతలు దీన్ని సమర్థిస్తారా? అస్సాం సీఎంపై భాజపా ఎందుకు చర్యలు తీసుకోలేదు. రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యల విషయాన్నీ వదిలిపెట్టను. కాంగ్రెస్‌తో పొత్తు కోసం రాహుల్‌ను వెనకేసుకొస్తున్నానని అంటున్నారు. తెరాసకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎనిమిదేళ్ల కిందట బిల్లు గురించి మోదీ రాజ్యసభలో ఎందుకు మాట్లాడారు? భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చేసిందేవిూ లేదు. దళితుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని చెబుతున్నా. దళితుల రిజర్వేషన్లు 19 శాతానికి పెంచాలని రాజ్యాంగం మార్చమంటున్నా. దేశమంతా దళితబంధు పెట్టడం కోసం రాజ్యాంగం మార్చమంటున్నా. బీసీల కులగణన కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా. రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలని అంబేడ్కర్‌ చెప్పారు. గుజరాత్‌లో దళిత బిడ్డలను చంపేస్తున్నారు. గుజరాత్‌లో కొత్తగా వివాహమైన దళితబిడ్డల ఊరేగింపులను సహించలేకపోతున్నారు. అందరికీ సమాన హక్కుల కోసం కొత్త రాజ్యాంగం కావాలి. 77 శాతం సంపద 10శాతం మంది దగ్గర ఉండొద్దు. 77శాతం సంపద 90శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కావాలి’’‘‘హిజాబ్‌పై దేశం మొత్తం మౌనం వహిస్తోంది. కర్ణాటకలోని విద్వేషం అంతటా వస్తే దేశం గతేంటి? ధర్మం పేరిట అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తారా? ధర్మం పేరిట విద్వేష రాజకీయం మానుకోవాలి. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, సరిగ్గా పనిచేయడం లేదని సర్కారియా కమిషన్‌ చెప్పింది. గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగం భాజపా హయాంలో పెరిగింది. ఇది దురదృష్టకరం మంచిది కాదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సంయమనం పాటించాలి. ఒకరినొకరు గౌరవించాలి. దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై భాజపాను వెళ్లగొట్టాలి. భవిష్యత్‌ రాజకీయాలను ఊహించి చెప్పలేం. భాజపా అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలి. ఈ దేశం కోసం ముందుకు కదలాల్సింది దేశ ప్రజలే. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు. ప్రజలు కలిసివస్తే నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది. అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ అవసరమైతే పెడతా. కొత్త పార్టీ పెడితే తప్పేవిూ లేదు.సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దని కార్మికులు పోరాడుతున్నారు. సింగరేణిలో కేంద్రం వాటాకు అవసరమైతే డబ్బులు చెల్లిస్తామని కూడా చెప్పాం. రాజకీయ ఫ్రంట్‌ను ఊహించొద్దు… ప్రజల ఫ్రంట్‌ను ఊహించండి. నేను ముంబయి వెళ్తా.. ఉద్ధవ్‌ ఠాక్రేను కలుస్తా. ఏదేమైనా ఈవిషయంలో నేను కీలకపాత్ర పోషిస్తా. దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు’’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సైన్యంపై రాహుల్‌ విమర్శలు చేసినప్పడు ఎవరూ మాట్లాడలేదన్న అసోం సీఎం వ్యాఖ్యలపై కేసీఆర్‌ స్పందించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ సమాచారాన్ని కేంద్రం బయటపెట్టాలని రాహుల్‌ అడిగారు అందులో తప్పేముందని వ్యాఖ్యానించారు.