పొన్నాల రాంపూర్ భూములు చట్టవిరుద్ధం
అవి ముమ్మాటికీ అసైన్డ్ భూములే : మంత్రి హరీశ్
అభ్యంతరం తెలిపిన జానా
సభాసంఘానికి విపక్షాల సమ్మతం
హైదరాబాద్, నవంబర్ 26 (జనంసాక్షి) : అన్యాక్రాంతమైన లక్షా 90వేల భూములపై ప్రభుత్వం సభాసంఘం ఏర్పాటుకు నిర్ణయించింది. అసైన్డ్ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య రాంపూర్ భూములు చట్ట విరుద్ధమని, అవి మూమ్మాటికీ అసైన్డ్ భూములేనని మంత్రి హరీశ్ స్పష్టంచేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. సభాసంఘం ఏర్పాటకు విపక్ష సభ్యులు మద్దతు తెలిపారు. తెలంగాణలో లక్షా 90 వేల ఎకరాల భూములు కబ్జాకు గురి అయ్యాయని సీఎం తెలిపారు. దళితులకు ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. దళితులకు ప్రభుత్వాలు కేటాయించిన భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దళితుల బతుకు ఉందన్నారు. సర్కార్ ఆజ్ఞ మేరకే పొన్నాల లక్ష్మయ్యకు భూములు కేటాయించారని చెప్పారు. భూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. పొన్నాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పొన్నాలకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని అప్పటి ఆంధప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. సభా సంఘం వేసేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. సభ్యులంతా చెప్పినట్లు సభా సంఘాన్ని వేసి కబ్జాకు గురైన భూముల వివరాలను సేకరిద్దామని కేసీఆర్ సభకు తెలిపారు.
రాంపూర్ అసైన్డ్ భూముల వ్యవహారంలో సభాసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్‌లో అన్యాక్రాంతమైన భూములపై సభలో బుధవారం చర్చ జరిగింది. రాంపూర్ అన్యాక్రాంత భూములపై చర్చ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. 1971లో రాంపూర్‌లో 106.01 ఎకరాల భూమిని దళితులకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. దళితుల భూములపై 1987లో పొన్నాల లక్ష్మయ్య, రామ్మోహన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆ సమయంలో అసైన్డ్ భూములను కొనుద్దు.. అమ్మోద్దు.. బదలాయించొద్దని హైకోర్టు తెలిపింది.అయితే నిబంధనలు అతిక్రమించి పొన్నాల 8 ఎకరాల భూమిని కొన్నారు. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ అయ్యాయి. పొన్నాల పట్ల అప్పటి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది అని హరీష్ సభకు వివరించారు. ఒకే జీవోపై ఏపీఐసీసీకి 75 ఎకరాలు, పొన్నాలకు 8 ఎకరాలు కట్టబెట్టారన్నారు. ఏపీఐఐసీని 12 శాతం వడ్డీ కట్టగా, పొన్నాలకు మాత్రం వడ్డీ లేకుండా 8 ఎకరాలు కట్టబెట్టారని చెప్పారు. అప్పటి ప్రభుత్వం కబ్జా చేసిన భూమికి చట్టబద్ధత కల్పించిందని,పొన్నాల అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎకరాకు రూ. 10 లక్షల విలువైన భూములను రూ. 25,500లకే కేటాయించారని అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని హరీష్ తప్పుబట్టారు.. కబ్జాకు గురైన దళితుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కడియం శ్రీహరి సహా దళిత నేతలు ధర్నా చేశారని ఆయన గుర్తు చేశారు. పొన్నాలకు కేటాయించిన భూముల పట్ల కాగ్ తప్పుబట్టిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దళితుల భూమిని కబ్జా చేశారని హరీష్‌రావు విరుచుకుపడ్డారు. పొన్నాల అసైన్డ్ భూముల చట్టాన్ని అతిక్రమించడాని తెలిపారు. ఏపీఐఐసీకి అప్పగించిన దళితుల భూములను పొన్నాల కబ్జా చేశారని చెప్పారు. అసైన్డ్ భూముల చట్టానికి వ్యతిరేకంగా జీవో తేవడమే తప్పు అని ఆయన స్పష్టం చేశారు. అసైన్డ్ భూములు కబ్జా చేసే ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని చట్టం చెబుతోంది.. మరీ ఏం చేద్దామని హరీష్ అడిగారు. దళితుల భూమలు కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములను ఇతరులకు కేటాయించొద్దని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అసైన్డ్ భూముల చట్టం ఏం చెబుతుందంటే ఒకసారి దళితుల భూమి కబ్జా చేస్తే మళ్లీ తిరిగి ఆ భూమి దళితులకే అప్పగించాలని చెబుతుందన్నారు. చట్టాన్ని అతిక్రమించి పొన్నాల దళితుల భూమిని ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు. తాను కబ్జా చేసిన భూములను సక్రమం చేసుకునేందుకు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ప్రయత్నం చేశారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి తనకు లబ్ధి చేకూరే విధంగా ప్రవర్తించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పొన్నాల లక్ష్మయ్య దళితుల భూమి ఆక్రమణపై ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ పొన్నాల ఆధీనంలో ఉన్నది దళితుల భూమేనని స్పష్టం చేశారు. ఈ భూమిపై టీడీపీ ఎప్పటినుంచో పోరాడుతుందని తెలపారు. జక్కులుద్దీన్ భూమి కూడా కభ్జాకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పొన్నాల భూవివాదంపై సభాసంఘం వేయాలని స్పీకర్‌ను కోరారు.పొన్నాల లక్ష్మయ్య కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ భూకబ్జాలపై ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని సూచించారు. మొదట 106 ఎకరాల అసైన్డ్ భూమిగా చెప్పారని.. ఆతర్వాత 97 ఎకరాలని చెబుతున్నారని అన్నారు. మిగిలిన భూమి ఎక్కడికి పోయిందో ప్రభుత్వమే చెప్పాలని కోరారు.





