బాల్యవివాహాలను నియంత్రించడంలో సక్సెస్
హైదరాబాద్,ఫిబ్రవరి5(జనంసాక్షి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు బాల్యవివాహాలను నియంత్రించడంలో విజయవంతమైనట్లు తేలింది. గతంలో సిఎం కెసిఆర్, ¬ంమంత్రి మమ్మూద్ అలీలు పలు సందర్భాల్లో దీనిగురించి చెబుతూ వచ్చారు. బాల్య వివాహాలకు ఈ పథకం అడ్డుకట్ట వేసిందన్నారు. ఇప్పుడు ఓ సర్వే కూడా ఇదేనిజమని తేల్చింది. కూకట్‌పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఈ పథకం అమలు, బాల్యవివాహాలపై అధ్యయనం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొడకండ్ల, రాయవరం, వెంకటాపురం, లికుడారం గ్రామాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఏ.మాలిక్ పర్యవేక్షణలో అర్థశాస్త్ర విభాగంలో కె.మహేశ్, కె.దేవి, శ్రీకాంత్, భానుప్రసాద్, గంగా, రోహన్‌ల విద్యార్థి బృందం క్షేత్రస్థాయిలోకి వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై అధ్యయనం చేసింది. అయితే ఈ పథకాల అమలుకు ముందు మూడేండ్ల వివరాలు పథకాల అమలు తర్వాత మూడు సంవత్సరాలవివరాలపై అధ్యయనం చేసి ప్రాజెక్టును రూపొందించారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల వల్ల బాల్యవివాహాలు క్షేత్రస్థాయిలో గణనీయంగా తగ్గాయని గుర్తించారు. 2011-14 సంవత్సరాల కాలంలో మొత్తం వివాహాల్లో 50 శాతం బాల్య వివాహాలు ఉండగా, 2014-17 సంవత్సరాల మధ్య కాలంలో మొత్తం వివాహాల్లో కేవలం 23.61 శాతం మాత్రమే బాల్య వివాహాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 2011-14 మధ్యకాలంలో 38.09 శాతం వివాహాలు జరుగగా, 2014-17 మధ్యలో 19.44 శాతం మాత్రమే బాల్య వివాహాలు జరిగాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు మాత్రమే వర్తింపజేస్తుండడం ఇందుకు ప్రధాన కారణంగా గుర్తించారు. చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు 18 ఏండ్లు నిండిన తరువాత పెండ్లి జేసేందుకు ఆసక్తి చూపుతున్నారని విద్యార్థుల బృందం చేసిన అధ్యయనంలో తేలినట్లు ప్రాజెక్టులో పొందుపరిచారు. గతంలో 18 ఏళ్ల లోపు వివాహాలపై పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా బాల్య వివాహాలపై ఎన్జీవోలు,పోలీసులు కూడా బాగా హెచ్చరికలు చేస్తున్నారు.




