Monday, 2 November 2026

వంద రోజుల్లో నల్లడబ్బు తెస్తామనలేదు

6

ఆ దిశగా ప్రక్రియ సాగుతుంది

వెంకయ్యనాయుడు

ఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి) : వందరోజుల్లోనే నల్లడబ్బు దేశానికి రప్పిస్తామని చెప్పలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ఆ దిశగా ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం నల్లధన అక్రమార్కుల పనిపడుతుందని, ఆఖరి నల్లధన ఖాతాను గుర్తించే వరకు విశ్రమించబోదని ఉద్ఘాటించారు. నల్లధన ఖాతాదారులను గుర్తించే ప్రయత్నాల్లో తాము నిబద్ధతతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. స్విట్జర్లాండ్‌ జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఇచ్చిన జాబితాలో ఉన్న 627 మంది ఖాతాదారుల్లో 427 మంది గుర్తింపును నిర్ధరించామని వెల్లడించారు. ఆ 427 మందిలో 250మంది తమకు విదేశాల్లో ఖాతాలు ఉన్నట్లు అంగీకరించారని తెలిపారు. ఈ పరిణామంతో నల్లధనంపై పోరులో ప్రభుత్వం పని కాస్త సులభతరం అయ్యిందన్నారు. వివరాలు గుర్తించిన 427 మందికి సంబంధించి ‘అసెస్‌మెంట్‌’, నోటీసుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. విపక్షాల డిమాండ్‌ నేపథ్యంలో నల్లధనంపై బుధవారం పార్లమెంటు ఉభయ సభల్లో రోజంతా చర్చ జరిగింది. రాజ్యసభలో చర్చకు జైట్లీ సమాధానమిచ్చారు. ఈ విషయంలో తొందరపడితే, ప్రజాకర్షక, సాహసపోత వైఖరిని అనుసరిస్తే అది అంతిమంగా అక్రమార్కులకే మేలు చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. అది ఆత్మాహత్యా సదృశమని, అలాంటి మార్గాన్ని ప్రభుత్వం అనుసరించబోదని చెప్పారు. ప్రభుత్వం వారి వివరాలు వెల్లడించాలా, వద్దా అన్న ఆలోచన చేయడంలేదనీ, ఎప్పుడు, ఎలా వెల్లడించాలా అన్నదే ఆలోచిస్తోందనీ స్పష్టం చేశారు. విదేశాలతో ఒప్పందాల్లో గోప్యత నిబంధనల కారణంగా విదేశాల్లో ఖాతాలున్నవారి వివరాలను బహిర్గతపరచలేమని పేర్కొన్నారు. వారిపై ఏదైనా న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్‌ మొదలయ్యే వరకు వాటిని వెల్లడించలేమన్నారు. హెచ్‌ఎస్‌బీసీ జాబితాలోని ఖాతాదారులకు సంబంధించి రానున్న వారాల్లో మరిన్ని ప్రాసిక్యూషన్లు చేపట్టనున్నామని చెప్పారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రక్రియ పూర్తికావడానికి ఎక్కువ సమయం పట్టినా ప్రభుత్వం సరైన మార్గంలోనే ఉంటుందని స్పష్టంచేశారు. ఈ విషయంలో ఆదాయపు పన్ను చట్టం చాలకపోవచ్చని, అయితే చర్యలు తీసుకోవడంలో ఎంతెయనా చొరవ చూపుతామని స్పష్టం చేశారు. అవసరమైతే చట్టాలు సవరిస్తామన్నారు. అక్రమార్కులను శిక్షించేందుకు లోపరహిత విధానాన్ని పాటిస్తామని తెలిపారు. నల్లధనంపై సర్కారు చర్యలను వివరిస్తూ- నరేంద్రమోదీ కేబినెట్‌ తొలి సమావేశంలోనే దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. సిట్‌కు సంబంధించిన ప్రతిపాదన 2011 నుంచి పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. నల్లధనంపై అన్ని పత్రాలను సిట్‌కు అందజేశామని చెప్పారు. ఈ నెలాఖరులోగా ఇది తన రెండో నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. చర్చ సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష ఉపనేత ఆనంద్‌ శర్మ మోదీపై, భాజపాపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పిస్తామని, ప్రతీ పౌరుడికి రూ.15 లక్షల చొప్పున పంపిణీ చేస్తామని మోదీ హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని, దీనిపై ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో మంత్రి జైట్లీ సమాధానం పూర్తికాక ముందే, దీనిపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, జనతాదళ్‌(యునైటెడ్‌), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం సభ్యులు వాకౌట్‌ చేశారు.

నల్లధనంపై దేశాన్ని తప్పుదారి పట్టించారు

నల్లధనం విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ దేశాన్నే తప్పుదోవ పట్టించిందని, దీనిపై కేంద్రం ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ప్రతిపక్షాల డిమాండ్‌తో నల్లధనంపై బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరిగింది. ‘ఓటింగ్‌కు అవకాశం లేని’ 193వ నిబంధన కింద జరిగిన చర్చలో కాంగ్రెస్‌, టీఎంసీ, ఎస్‌పీ తదితర పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే, విదేశాలనుంచి  నల్లధనాన్ని తెప్పించడంలో సరైన మార్గంలో పయనిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జునఖర్గే చర్చను ప్రారంభించారు. నల్లధనాన్ని వెనక్కు తెస్తే దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తికీ రూ. 15లక్షల చొప్పున వస్తాయంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం ద్వారా ప్రధాని మోదీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నారన్నారు. వందరోజుల్లోగా నల్లధనాన్ని వెనక్కు తెస్తామన్నారని, ఇపుడు అధికారంలోకి వచ్చినా పైసా కూడా తేలేదని విమర్శించారు. 125 కోట్ల మంది ప్రజలను తప్పుదారి పట్టించి, తప్పుడు హావిూలు ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నల్లధనంపై ప్రజలను తప్పు దారిపట్టించినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని తృణమూల్‌ నేత సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ డిమాండ్‌ చేశారు. నల్లధనం దాచిన వారందరి పేర్లనూ ప్రభుత్వం ఇంటర్నెట్‌లో పెట్టాలన్నారు.

నల్లధనం అంశంపై బీజేపీ సభ్యుడు అనురాగ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగారు.   హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుల ఖాతాదార్ల పేర్లను సీల్డ్‌ కవర్‌లో సిట్‌కు అందించింది తమ ప్రభుత్వమేని, నల్లధనం అంశాన్ని జీ-20 సదస్సు వేదికపై ప్రస్తావించింది మోదీయేనని అన్నారు. తృణమూల్‌పైనా అనురాగ్‌ మండిపడ్డారు. శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. విదేశాల్లోని నల్లధనంపై మాట్లాడేముందు దేశంలో ఏం జరుగుతోందనేది మాట్లాడాలన్నారు.

నల్లధనంపై అవాస్తవాలు చెప్పినందుకు బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష ఉపనేత ఆనంద్‌శర్మ డిమాండ్‌ చేశారు. విదేశాల్లో  నల్లధనం వెనక్కు తెస్తే.. ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి రూ. 15 లక్షలు జమ చేయవచ్చని మోదీ ఎన్నికల ప్రచారంలో అన్నారని ఇపుడు నల్లధనం ఎంతో తెలియదని వారంటున్నారని విమర్శించారు. ‘మంచి రోజులు వచ్చాయి (అచ్చే దిన్‌ ఆగయా)’ అనే బీజేపీ నినాదాన్ని ప్రస్తావిస్తూ.. ”మంచి రోజులు వచ్చాయి.. జనం వారి ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ అవుతాయని ఎదురు చూస్తున్నారు” అని శర్మ ఎద్దేవా చేశారు. నల్లధనం వెనక్కు తెచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తృణమూల్‌ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్‌ విమర్శించారు. జేడీయూ సీనియర్‌ నేత శరద్‌యాదవ్‌ , బీఎస్‌పీ నేత మాయావతి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

427 మందిని గుర్తించాం

విదేశాల్లో బ్యాంకు ఖాతాలు గల వారి పేర్లతో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఇచ్చిన 627 మంది జాబితాలో 427 మందిని గుర్తించామని.. అందులో 250 మంది తమకు ఖాతాలున్నట్లు అంగీకరించారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. నల్లధనంపై చర్చకు ఆయన రాజ్యసభలో సమాధానమిస్తూ నల్లధనాన్ని వెనక్కు తెచ్చేందుకు తమ ప్రభుత్వం సరైన మార్గంలో పయనిస్తోందని, నల్లదనాన్ని రప్పించే ప్రక్రియకు వ్యవధి పడుతుందని అన్నారు. అయితే.. జైట్లీ సమాధానం కొనసాగుతుండగానే కాంగ్రెస్‌, తృణమూల్‌, జేడీయూ, ఎస్‌పీ, సీపీఎం సభ్యులు వాకౌట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *