– ముందస్తు ఎన్నికలొస్తే కాంగ్రెస్ సిద్ధంగానే ఉంది
– పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందనుకోవటం లేదు
– రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
– సీఎల్పీ నేత జానారెడ్డి
హైదరాబాద్, జూన్29(జనం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్సేనని, గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ విసిరిన సవాల్ హాస్యాస్పదమన్నారు. అయినా ఏ కారణంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ సిద్ధంగానే ఉందన్నారు. తెలంగాణలో రాబోయేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమేనని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేనన్నారు. కర్ణాటక తరహాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. తెలంగాణలో తెలివిలేని సర్కార్ ఉందని ధ్వజమెత్తారు. డీఎస్ తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్న సమాచారం తనకు తెలియదన్నారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న దానం నాగేందర్ వ్యాఖ్యలు అబద్ధమని జానా కొట్టిపారేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనితీరుపై సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని అనుకోవడం లేదని చెప్పారు. తన హయాంలో ఒకే వర్గానికి పోలీస్ ప్రయోషన్ల ఇచ్చినట్లు వచ్చిన వార్తలు అవాస్తమని జానారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. గద్వాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను హౌస్ అరెస్ట్ చేయడాన్ని జానారెడ్డి ఖండించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. పోలీస్ రాజ్యం నడుపుతామనుకోవడం అవివేకం అన్నారు. నియంతృత్వ దేశాల్లో కూడా ఇంతటి నిర్బంధం లేదని చెప్పారు. రేషన్ డీలర్లపై ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్నారు. డీలర్లను చర్చలకు పిలవాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని జానారెడ్డి హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే




