వరుణుడు కరుణతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురస్తున్న వర్షాలతో పంటలకు ప్రాణం వచ్చింది. అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఊపిరి పీల్చుకున్నారు. అల్పపీడన ద్రోణి నైరుతి దిశలో ప్రయాణిస్తున్నందున రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలైన పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది, సోయాబీన్, పెసరకు ప్రాణం పోస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బయ్యారం మండలంలో 70.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. మందమర్రి 70.2, బెజ్జూరు 59.2, కాసిపేట 48.4, బేలా 46.4, సారంగాపూర్‌లో 45.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ 38.6, వేమనపల్లి 38.2, నిర్మల్‌లో 37, దహెగాంలో 33.4 మిల్లిమీటర్ల వాన పడింది. జైపూర్, రెబ్బన 32.4, భైంసా 31, లక్ష్మణచాంద 29.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. ముథోల్ 28.8, ఆదిలాబాద్ 28.4 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల, కోటపల్లి, కడెం, మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నల్లగొండ జిల్లాలో 29 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నేరేడుచర్ల మండలంలో 40 మిమీ, వేములపల్లి 39.2, కోదాడ 38.2, గరిడేపల్లిలో 36.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. శాలిగౌరారం 26.4, చిలుకూరు 21.4, చిట్యాల 21.0 మిల్లి మీటర్ల వర్షం కురిసింది. నార్కట్‌పల్లి 13.8, మిర్యాలగూడ 10.8, మఠంపల్లి 10.6, కట్టంగూర్ 9.8 మిల్లిమీటర్ల వాన పడింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో 57.4, బాన్సువాడ 37.6, బీర్కూర్ 36.2, వర్ని 32.6, మద్నూర్ 30.4 మిల్లిమీటర్ల వాన పడింది. కోటగిరి 29.4, ఎడపల్లి 24.6, లింగంపేట 32.2, జక్రాన్‌పల్లి 14.4, నందిపేటలో 17 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లా అందోల్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, కల్హేర్, అల్లాదుర్గం, సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలపై కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి.. సముద్రమట్టానికి 5. 8 కిలోమీటర్ల ఎత్తున నెలకొన్న ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులర్‌తో కలిసి నైరుతి దిశగా పయనిస్తున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి ఉరుములు, మెరుపులతోకూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దని పేర్కొన్నది




